ఓ ఆటాడుకున్నారు..! పాక్‌పై కొనసాగిన.. టీమిండియా జైత్రయాత్ర!!

icc-world-cup-2019-team-india-players
- Advertisement -
వరల్డ్ కప్ లో టీమిండియా ప్రభంజనం…
వర్షం అంతరాయం…
మ్యాచ్ వన్ సైడ్ కావడంతో అభిమానుల నిరాశ…
రోహిత్ అద్భుత సెంచరీ..
బౌలింగ్‌లో పాకిస్తాన్ నడ్డి విరిచిన కుల్దీప్, పాండ్యా…

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా.. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ దేశాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ చివరికి వన్ సైడ్ అయిపోయింది. పాకిస్తాన్‌‌పై విజయభేరి మోగించి.. వరల్డ్ కప్‌లో మరోసారి టీమిండియా తన గెలుపు సంప్రదాయాన్ని కొనసాగించింది.

ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్‌ టోర్నీలలో ఇండియా-పాకిస్తాన్ ఆరుసార్లు తలపడ్డాయి. అన్నిసార్లూ ఇండియా విజయం సాధించింది. ఈసారి కూడా ఇంగ్లండ్‌లో జరిగిన 2019 వరల్డ్ కప్‌ టోర్నీలోనూ అదే ఫలితం పునరావృతమైంది.

టీమిండియా ప్రధాన బౌలర్ భువనేశ్వర్ రెండో ఓవర్‌లోనే గాయం కారణంగా ఫీల్డ్ వదిలేసి గట్టి షాక్ ఇచ్చినా.. ఆ ప్రభావం పడకుండానే.. ఎప్పటిలాగే తన జైత్రయాత్రను కొనసాగించి క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఏడో విజయాన్ని నమోదు చేసి, టీమిండియా తన రికార్డ్‌ను మెరుగుపరుచుకుంది.

మొదట బ్యాటింగ్ ప్రారంభించి…

ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 336 పరుగులు చేసింది. బదులుగా పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ టార్గెట్ 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ధారించారు.

అప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాను.. చివరికి ఆరు వికెట్లకు 216 పరుగులు చేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. టీం ఇండియా జైత్రయాత్ర నేపథ్యంలో ఆర్బీసీ అందించే ప్రత్యేక కథనం.

వర్షం సూచనల నేపథ్యంలో…

అభిమానుల భయాందోళనల మధ్యే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ లో ప్రారంభమైంది. అయితే మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకొని..భారత్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది.

ఈ క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా..ఎక్కడా తొట్రుపాటు పడకుండా ఆడింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇద్దరూ సమయోచితంగా ఆడి మొదటి వికెట్ కు 136 పరుగులు జోడించారు.

శిఖర్ ధావన్ లేకుండానే…

ప్రమోషన్ పై వచ్చిన రాహుల్ ఇండియాకు మంచి శుభారంభాన్ని అందించి.. తన వ్యక్తిగత స్కోరు 57 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ విరాట్ కొహ్లీ.. మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.

ఈ క్రమంలో అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన రోహిత్ శర్మ కేవలం 113 బాల్స్ తో చేసిన 140 పరుగులు చేసి..జట్టుని సురక్షిత స్థాయికి తీసుకువెళ్లాడు. మ్యాచ్ కి రోహిత్ బాటింగ్ హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా టెన్షన్ పడకుండా అలవోకగా ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశాడని చెప్పాలి.

విరాట్ కొహ్లీ కొత్త రికార్డ్ …

తర్వాత సెకండ్ డౌన్ లో వచ్చిన హార్దిక్ పాండ్యా.. కాసేపు మెరుపులు మెరిపించి 23 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఈ క్రమంలో తర్వాత వచ్చిన ధోనీ ఒక్క పరుగు మాత్రమే చేసి.. అవుటవడంతో.. చివరలో కొహ్లీ కూడా రన్ రేట్ పెంచే క్రమంలో 77 పరుగుల వద్ద అవుట్ అయి వెనుతిరిగాడు.

ఈ క్రమంలో 222 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో అత్యంత వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కొహ్లీ ఘనత సాధించాడు. ఇంతకుముందు సచిన్ టెండుల్కర్ ఈ పరుగులు సాధించడానికి 284 మ్యాచ్ లు తీసుకున్నాడని లెక్కలు చెబుతున్నాయి. అయితే 17 ఏళ్లుగా ఈ రికార్డ్ సచిన్ పేరు మీద ఉంది. ఇప్పుడు కొహ్లీ దానిని అధిగమించడం విశేషం.

మొత్తానికి చివరలో కొత్తగా జట్టులో చేరిన విజయ శంకర్, కేదార్ జాదవ్ స్కోర్ ని పెంచి 336 పరుగుల వద్ద ముగించారు. ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 47 ఓవర్లు దాటిన తర్వాత భారీ వర్షం పడి మ్యాచ్ కి అంతరాయం కలిగింది. వర్గం తగ్గిన వెంటనే ఇండియా 50 ఓవర్లు ముగించింది.

పలుమార్లు వర్షం.. అంతరాయం

తర్వాత బ్యాటింగ్ ప్రారంభించేందుకు గ్రౌండ్ లోకి పాకిస్తాన్ ఓపెనర్లు వచ్చినప్పుడు..వర్షం మళ్లీ వచ్చింది. దాంతో కాసేపు అందరూ వెనుతిరిగారు. మళ్లీ తగ్గిన వెంటనే వచ్చారు. ఇలా ఆట కొనసాగుతందా? లేదా అనే టెన్షన్ లోనే మ్యాచ్ ప్రారంభమైంది. మొదట నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించారు.

ఈసారి ఇండియా జట్టు ఆ ఒత్తిడిని జయించిందనే చెప్పాలి. లేదంటే అటు శిఖర్ ధావన్ లేకపోవడం, మ్యాచ్ ప్రారంభిన ప్రధాన బౌలర్ భువనేశ్వర్ వెనుతిరగడం ప్రతికూలంగా కనిపించినా..టీం ఇండియా సమష్టి కృషి ముందు అవి పెద్దగా ప్రభావం చూపలేదు.

మొదటి మ్యాచ్.. మొదటి బాల్.. మొదటి వికెట్..విజయశంకర్ గ్రేట్ ఎంట్రీ

బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ ఓపెనర్లు జాగ్రత్తగానే బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే భారత జట్టు ప్రధాన బౌలర్ భువనేశ్వర్ రెండో ఓవర్ లో నాలుగు బంతులేసి గాయం కారణంగా పెవెలియన్ కి వెళ్లిపోయాడు.

ఆ ఓవర్ లో మిగిలిన రెండు బాల్స్ ని..అప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి మొదటి మ్యాచ్ ఆడుతున్న విజయ శంకర్ చేతికి కెప్టెన్ కొహ్లీ బంతిచ్చాడు. అలా తను వేసిన మొదటి బంతికే వికెట్ తీసి..ఆరంగ్రేటాన్ని ఘనంగా చాటాడు.

అలా తొలి వికెట్ ఇమామ్ ఉల్ హక్ రూపంలో పడింది. తర్వాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన బాబర్, మరో ఓపెనర్ ఫకర్ ఇద్దరూ గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. 100 పరుగులు పైనే పార్టనర్ షిప్ నమోదైంది.

కుల్దీప్ బౌలింగ్‌తో మ్యాచ్ టర్నింగ్… 

ఈ దశలో మ్యాచ్ ఇండియా చేయి జారిపోతుందా? అని అందరూ అనుకునే క్రమంలో స్పిన్నర్ కుల్దీప్ వేసిన అద్భుతమైన గుగ్లీకి.. 48 పరుగులు చేసిన బాబర్ అజామ్ వికెట్టు నేల కూలింది.అప్పటికి పాకిస్తాన్ జట్టు స్కోరు 24 ఓవర్లలో 117 పరుగులున్నాయి..

ఆ తర్వాత ఓవర్ కి వచ్చిన కుల్దీప్ వేసిన మరో బాల్ ని స్వీప్ చేయబోయిన ఫకర్ థర్డ్ మేన్ కి క్యాచ్ ఇచ్చి 62 పరుగులు దగ్గర దొరికిపోయాడు.. ఈ రెండు వికెట్లతో కుల్దీప్ ఇండియాకి టెన్షన్ తగ్గించాడనే చెప్పాలి.

నడ్డి విరిచిన పాండ్యా…

తర్వాత మరో కొత్త స్పెల్ లో బౌలింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా 9 పరుగులు చేసిన మహ్మద్ అఫీజ్ వికెటు తీసుకున్నాడు. లాంగ్ ఆన్ లో విజయ శంకర్ క్యాచ్ తీసుకోవడంతో అతను అవుటైపోయాడు..అతని స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన షోయబ్ మాలిక్ పాండ్యా తరువాత బాల్ కి వికెట్ల మీదకు ఆడుకొని అవుటైపోయాడు.

వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసుకొని పాకిస్తాన్ నడ్డి విరగ్గొట్టాడనే చెప్పాలి. ఈ మొత్తం నాలుగు వికెట్లు..మూడు ఓవర్ల తేడాలో పడిపోయాయి. అప్పటికి జట్టు స్కోరు 5 వికెట్లకు 129 పరుగులు..

ఇక అంతే.. ఏ దశలోనూ పాకిస్తాన్ కోలుకోలేదు…

తర్వాత కెప్టెన్ సర్ఫరాజ్ వచ్చాడు. కాసేపు నిలబడి 12 పరుగులు చేసి అవుటై పోయాడు. తర్వాత వచ్చిన ఇమాద్ వసీమ్ 39 బాల్స్ లో 46 పరుగులు చేసి హడావుడి చేశాడు. ఈ క్రమంలో 35 ఓవర్లకు 166 పరుగులు చేశారు. అప్పుడు మళ్లీ వర్షం ప్రారంభమైంది. అందరూ పెవెలియన్ చేరారు.

చివరికి వర్షం తగ్గాక డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ ని 40 ఓవర్లకి కుదించారు. పరుగులు మాత్రం 302 చేయాలని పేర్కొన్నారు. అప్పటికి 166 పరుగులతో మొదలుపెట్టి మరో 5 ఓవర్లలో అంటే 30 బంతుల్లో 44 పరుగులు చేయగలిగారు.

అలా మొత్తానికి 212 పరుగుల వద్ద పాకిస్తాన్ ప్రస్థానం ముగిసింది. వరల్డ్ కప్ లో ఇండియా విజయయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది.

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’గా రోహిత్ శర్మ…

మ్యాచ్ ని టర్న్ చేసింది మాత్రం  కుల్దీప్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ అనే చెప్పాలి. వరుస ఓవర్లలో ఒకరు, వరుస బంతుల్లో ఒకరు చెరో రెండేసి వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ ను మరే దశలోనూ కోలుకోకుండా చేయడం.. ఈరోజు మ్యాచ్ లో హైలైట్ అని చెప్పాలి. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా క్రీడా విశ్లేషకులు పేర్కొన్నారు.

మొత్తానికి సగర్వంగా ఆడిన మ్యాచ్ లన్నీ విజయం సాధించి.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న టీం ఇండియా.. వరల్డ్ కప్ మళ్లీ తీసుకురావాలని కోరుకుందాం.

– శ్రీనివాస్ మిర్తిపాటి
- Advertisement -