ఎస్సీ ఎస్టీ ఆట్రాసిటీ కేసు… మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్…

mojo-tv-former-ceo-revathi
- Advertisement -

హైదరాబాద్: మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం బంజరాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మోజీ టీవీ స్టూడియోలో దళిత నేతనైన తనను అవమానించారంటూ హమారా ప్రసాద్‌ పెట్టిన కేసులో రేవతి ఏ-2 గా ఉన్నారు. అయితే ఈ కేసులో తాము ఇచ్చిన నోటీసులకు రేవతి స్పందించలేదని, అందుకే ఆమెను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై జనవరి 24న మోజో టీవీలో చర్చ నిర్వహించారు. జాతీయ ఎస్సీ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాగులరపు వరప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్ ఈ చర్చకు హాజరయ్యారు. చర్చలో యాంకర్ రఘు, వరప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వరప్రసాద్‌ను స్టూడియో నుంచి బయటకు పంపించారు.

చదవండి: హైకోర్టులో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఊరట!

దీంతో దళితుడైన తనను మోజో టీవీ యాజమాన్యం అవమానించిందంటూ అప్పట్లోనే.. హమారా ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసుకు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం ఉదయం మోజో టీవీ మాజీ సీఈవో రేవతి ఇంటికి వెళ్లి ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు. అలాగే న్యూస్ ప్రెజెంటర్ రఘును కూడా వారు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులతో రేవతి వాగ్వాదం…

అయితే తన ఇంటికి వచ్చిన పోలీసులతో రేవతి వాగ్వాదానికి దిగారు. ఎలాంటి వారంట్, నోటీసులు లేకుండా ఎందుకు వచ్చారని ఆమె ప్రశ్నించారు. తమతోపాటు పోలీసు స్టేషన్‌కి రావాలని పోలీసులు చెప్పగా అందుకు ఆమె నిరాకరించారు. దీంతో తమకు సహకరించకుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాల్సి వస్తుందని పోలీసులు తేల్చి చెప్పారు.

ఇంకా టీవీ9 చానల్ నిధుల మళ్లింపు వ్యవహారంలో కూడా రేవతి ప్రమేయం ఉందని.. ఆ టీవీ చానల్ మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఆమె సహకరించారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మోజో టీవీ యాజమాన్యం సీఈవో పదవినుంచి ఇటీవల రేవతిని తొలగించింది.

అయితే బంజారాహిల్స్ పోలీసులు తనను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారంటూ రేవతి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తన కుమార్తెను స్కూల్‌‌కు పంపాలని, తనకు డాక్టర్ అపాయింట్ మెంట్ ఉందని చెప్పినా కూడా పోలీసులు వినలేదని ఆ ట్వీట్‌లో తెలిపిన రేవతి.. నేనేమైనా టెర్రరిస్టునా? అని కూడా ప్రశ్నించారు.

చదవండి: టీవీ9 ఇష్యూ: విచారణకు హాజరుకాలేనన్న నటుడు శివాజీ, పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా…

 

- Advertisement -