డబ్బు కోసం 13 ఏళ్ల వయసులోనే నన్ను..: తల్లిపై నటి సంగీత సంచలన వ్యాఖ్యలు

3:14 pm, Sun, 14 April 19
actress sangeetha sensational comments on her mother

హైదరాబాద్: ‘‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..’’ సినీరంగంలోకి రావాలని ప్రయత్నించే వాళ్లు చెప్పే ఈ డైలాగ్‌ ‘ఖడ్గం’ చిత్రంతో ఎంత పాపులర్ అయిందో.. ఈ చిత్రంలో ఆ డైలాగ్‌తో హీరోయిన్ సంగీత కూడా అంతే ఫేమస్ అయింది.

‘ఖడ్గం’ తర్వాత సంగీత ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషీ ఖుషీగా’, ‘సంక్రాంతి’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌‌గానే కాకుండా గ్లామరస్ నటిగా కూడా పేరు తెచ్చుకుంది.

తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సంగీత 2009లో సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే ఇటీవల సంగీత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం ఆమె కుటుంబంలో ఏర్పడిన తగాదాలే.

వ‌ృద్ధురాలైన తనను తన కూతురు సంగీత ఇంట్లోంచి గెంటివేసిందని ఆరోపిస్తూ తాజాగా సంగీత తల్లి భానుమతి తమిళనాడు రాష్ట్ర మహిళా సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ తగాదాలు చినికి చినికి గాలివానలా మారాయి.

దీంతో నటి సంగీత తన కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసిందంటూ తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. సంగీత కుటుంబ తగాదా తమిళ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో సోషల్ మీడియా ద్వారా సంచలన విషయాలను బయటపెట్టింది నటి సంగీత.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ‘డియరెస్ట్ మామ్..’ అంటూ తన తల్లి భానుమతి తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంటూ తిరిగి తల్లిపైనే ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

సంగీత ఏం చెప్పిందంటే…

‘‘ప్రియమైన నా తల్లి.. నాకు జన్మ ఇచ్చినందుకు ధన్యవాదాలు..’’ అంటూ మొదలుపెట్టిన సంగీత కన్నతల్లిపై విరుచుకుపడింది. ‘‘ఆడపిల్లనని కూడా చూడకుండా నా 13వ ఏట నుంచే స్కూల్ మాన్పించేసి.. డబ్బు కోసం నాతో పని చేయించావు. నా సంపాదనపై ఆశతో నాకు పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కూడా చేయలేదు. డబ్బు కోసం నువ్వు, మ్యదం, డ్రగ్స్‌కు బానిసలైన నీ కొడుకులు నన్ను ఎన్ని రకాలుగా హింసించారు?’’ అంటూ ప్రశ్నించింది.

‘‘నాతో బ్లాంక్ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. నా సంపాదనపై మోజుతో నాకు మీరు పెళ్లి చేయకపోగా.. నేను పెళ్లి చేసుకుంటే.. ఇప్పుడు నాతోపాటు నా భర్తను కూడా వేధిస్తున్నారు. మాకు ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.. అయినా నేను మీ వేధింపులకు కుంగిపోలేదు.. పరిణితి చెందాను.. అన్నింటినీ దీటుగా ఎదుర్కొంటాను..’’ అంటూ పేర్కొంది.

అంతేకాదు, సినీ ప్రియులందరికీ తాను చెప్పేది ఏమిటంటే.. ఒక యాక్టర్‌గా ఉండడం అనేది అంత సులభమైనది కాదని, తన బాగు కోరుకునే వాళ్లు ఎల్లప్పుడూ తనతో ఉంటుంన్నందుకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని సంగీత తన ట్వీట్‌లో పేర్కొంది.