ప్రచారంలో అసభ్యంగా.., చెంప పగలగొట్టిన హీరోయిన్ ఖుష్బూ.. వీడియో వైరల్!

2:01 pm, Thu, 11 April 19
actress khushboo slaps youth during congress rally in bangalore

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు 2019కి సంబంధించిన తొలిదశ పోలింగ్ గురువారం ఉదయం మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం కూడా నిలిచిపోయింది.

ఈ ఎన్నికలకు సంబంధించి పలు పార్టీల తరుపున పలువురు సినీతారలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సినీనటి ఖుష్బూ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో పార్టీ తరుపున చురుగ్గా పాల్గొంటున్నారు.

ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన ఓ సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖుష్బూ తన ప్రచారంలో భాగంగా పార్టీ తరుపున బెంగళూరులో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

రిజ్వాన్ నివాసానికి ఆమె వెళ్లిన సమయంలో అక్కడ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు చుట్టూ చేరారు. వారిని అదుపు చేయడం పోలీసులకూ కష్టంగా మారింది.

ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించగా…

ఆ సమయంలో కారు ఎక్కేందుకు వెళుతున్న ఖుష్బూతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించగా, ఆమె హఠాత్తుగా వెనక్కి తిరిగి అతడి చెంప చెళ్లుమనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఆ వ్యక్తి ముఖం సరిగా కనిపించడం లేదుగానీ, ఖుష్బూ వెనక్కి తిరిగి అతడి చెంపపై కొట్టడం మాత్రం కనిపిస్తోంది. అతడు అసభ్యంగా ప్రవర్తించి ఉంటాడని, అందుకే ఆమె అలా రియాక్ట్ అయి ఉంటారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వీడియోని ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘‘దీనినే కన్నడలో కపాల మోక్షం అంటారు.. బెంగళూరు సెంట్రల్ అభ్యర్థి తరుపున ప్రచారానికి వచ్చిన ఖుష్బూ సుందర్ ఓ వ్యక్తి తన పట్ల మిస్ బిహేవ్ చేయడంతో అతడి చెంప పగలగొట్టారు. కొంతమంది మహిళా రిపోర్టర్లు కూడా ఇలాంటి ఘటనలకు గురువుతుంటారు. వారంతా ఖుష్బూని చూసి చేర్చుకోవాలి..’’ అంటూ కామెంట్ కూడా జతపరిచాడు.

మరోవైపు ఖుష్బూ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని అక్కడికక్కడే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఖుష్బూ ప్రస్తుతం తన భర్త సుందర్ దర్శకత్వంలో.. విశాల్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.