ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కృష్ణ

10:58 pm, Thu, 27 June 19
actress-and-director-vijaya-nirmala

హైదరాబాద్: ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూశారు. ఆమె వయస్సు 73 ఏళ్లు. విజయనిర్మల అలనాటి ప్రముఖ సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదారాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

విజయ నిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌ పట్ల కృతజ్ఞతతో తన పేరుకు ముందు ‘విజయ’ అని చేర్చుకుని విజయనిర్మలగా మారారు. నటుడు నరేశ్‌కు విజయనిర్మల తల్లి. అలాగే ప్రముఖ సినీనటి జయసుధకు ఈమె పిన్ని.

ఏడో ఏటనే బాల నటిగా…

విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో జన్మించారు. 1950లో ఓ తమిళ చిత్రం ద్వారా తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయనిర్మల.. పదకొండేళ్ల వయస్సులో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. తెలుగులో ‘పాండురంగ మహత్మ్యం’లో ఆమె బాలనటిగా చేశారు. ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా విజయనిర్మల హిరోయిన్‌గా మారారు.

అంతేకాదు, విజయనిర్మల తొలి తెలుగు మహిళా దర్శకురాలు కూడా. ఆమె మొత్తం 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా చరిత్ర సృష్టించిన విజయనిర్మల పేరు 2002లో గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కింది.

విజయనిర్మల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మీనా’. 1971లో ఈ సినిమా వచ్చింది. అది మొదలు ఆమె వెనక్కి చూడలేదు. 2009 వరకు మొత్తం 44 సినిమాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆమె సినిమాలు తీశారు.

దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలు విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కాయి.

2009లో సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా తీసిన నేరము-శిక్ష చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం. విజయనిర్మలకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా దక్కింది.