హర్రర్ సినిమాలకు ఓ ‘స్క్రీన్ ప్లే లెసన్’.. ఈ సినిమా!

ring-movie

రాత్రి ఎనిమిది అవుతోంది.. వర్షం వచ్చేలా ఉంది.. బయట అంతా నిర్మానుష్యంగా ఉంది.. సిటీకి దూరంగా ఒంటరిగా ఓ కాటేజి.. లోపలకు వెళితే.. ఓ గదిలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు.. టీవి చూస్తూ మాట్లాడుకుంటున్నారు. మాటల్లో అప్పటికే వైరల్ గా మారిన ఓ వీడియో టేప్ ప్రస్తావన వచ్చింది.

“వీడియో టేప్ గురించి విన్నావా? అది చూడగానే చనిపోతారని…”
“ఎలాంటి వీడియో టేప్..”?
‘‘మామూలు వీడియో టేప్ లాంటిదే.. అందరూ అద్దెకు తీసుకునేదే.. ఆ టేప్ చాలా థ్రిల్ కలిగించేలా ఉంటుంది.. అందులో ఓ అమ్మాయి టీవిలో కనిపిస్తుంది. ఆ అమ్మాయి మన వంకే  చూస్తూ ఉంటుంది. టేప్ అయిపోగానే నీ ఫోన్ మ్రోగుతూ ఉంటుంది. అవతలి వాళ్లకు అంతా తెలుసు… నువ్వు ఏడు రోజుల్లో చనిపోతావని.. అదే విషయం గుర్తు చేస్తారు..’’

“సరిగ్గా ఏడు రోజులు తర్వాత…???”
‘‘ఎవరు చెప్పారు…?’’
‘‘ఎందుకలా అడుగుతున్నావు?’’
కొద్ది క్షణాలు నిశ్శబ్దం..

‘‘నేను దాన్ని చూసాను…’’
‘‘హేయ్.. అలాంటి సోది కథలు నాకు చెప్పకు…’’
‘‘లేదు.. లేదు..నేను నా బోయ్ ఫ్రెండ్.. క్రిందటి వారం చూశాం…’’
‘‘ఆ విషయం అప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు..?’’
‘‘అది అనుకోకండా జరిగింది.. ఫుట్ బాల్ గేమ్ రికార్డ్ చేయటానికి ట్రై చేస్తూంటే.. అది రికార్డ్ కాలేదు. కానీ అందులో..’’
‘‘ఏముంది అందులో…?’’
‘‘ఏదో ట్రాష్.. అదో జోక్ అని మేము నవ్వుకున్నాం.. కానీ.. ఇంతలో ఫోన్ రింగైంది.. వారం రోజులే బ్రతుకుతానట.. ఇదంతా జరిగి కూడా ఓ వారం అవుతోంది..’’

వింటున్న అమ్మాయి  మొహం భయంతో పాలిపోయింది.
అదే సమయంలో.. చెబుతున్న అమ్మాయి శరీరంలో ఏదో మార్పు ప్రారంభమైంది. ఎవరో బలవంతగా చంపటానికి ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది.
అయితే అది కొద్ది క్షణాలే…
తను చెప్పిన వీడియో రూమర్ కు కౌంటర్ గా తనను భయపెట్టడానికి ఆమె ప్రాక్టికల్ జోక్ ప్లే చేసిందని తెలిసి… ఇద్దరూ నవ్వుకున్నారు… అంతలో- అక్కడున్న ల్యాండ్ లైన్  ఫోన్ మ్రోగింది..

ట్రింగ్…ట్రింగ్..ట్రింగ్..

ఒక్కసారిగా ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ఇధ్దరిలో ఏదో తెలియని భయం మొదలైంది. ఓఅమ్మాయి వెళ్లి ఫోన్ మెల్లగా ఎత్తింది.  అవతలి నుంచి వాళ్ళ అమ్మ… హమ్మయ్య.. పెద్ద రిలీఫ్.. అది చూసి నవ్వుకుని ఒకమ్మాయి వెళ్లి పడుకుంది. మరో అమ్మాయి ఫోన్ మాట్లాడి  నిద్రకు ఉపక్రమిద్దామనుకుంది.

కానీ ఈసారి మాత్రం ఆ ప్రాక్టికల్ జోక్ నిజమవుతోంది. వారం క్రితం వాళ్లు చూసిన వీడియో క్యాసెట్, ల్యాండ్ లైన్ ఫోన్ ఎఫెక్ట్.. నిజంగానే మొదలైంది.

ఆ గదిలోని  టీవి… దానంతట అదే ఆన్ అయ్యింది.  బ్లాక్ అండ్ వైట్‌లో… కేబుల్ కనెక్షన్ లేనప్పుడు స్క్రీన్‌పై వచ్చే చుక్కలు, శబ్దంతో.  దగ్గరకు వచ్చేసరికి ఎవరో కట్టేసినట్లు టీవీ దానంతట అదే ఆగిపోయింది. ఆ గదిలోంచి వెళ్దామనుకునేసరికి మళ్లీ టీవి దానంతట అదే ఆన్ అయ్యింది.

ఆ అమ్మాయి ముఖంలో ఈసారి నిజంగానే భయం… ఆ గదిలోని ఫ్రిజ్ తలుపు మెల్లగా దానంతట అదే తెరుచుకుంది… ఆమె గుండె శబ్దం ఆమెకే వినిపిస్తోంది. ఆ వీడియో టేప్ తనను నిజంగానే చంపేస్తుందా..? ఆ ఫోన్ కాల్ నిజమేనా…?

ఆమె కళ్లలో చావు భయం కనిపిస్తోంది. అప్పటివరకూ ఏదో ప్రాక్టికల్ జోక్ అనుకున్న విషయం నిజం కాబోతోందా? ఆ అమ్మాయి తన స్నేహితురాలని పిలుస్తోంది వణికే గొంతుతో.. కానీ అప్పటికే సమయం మించిపోయింది… అప్పటివరకు తాము మాట్లాడుకున్న రూమర్ నిజమవుతున్న క్షణాలు … మృత్యువు నీడ అప్పటికే ఆ గదిలో కనిపిస్తోంది..

ring-movie1‘చూస్తే ఛస్తావ్’…

ఇదీ 1998లో వచ్చిన ‘రింగ్’ అనే జపనీస్ చిత్రంలోని మొదట సీన్. ఈ సీన్ చూసిన వాళ్లు భయంతో గడ్డకట్టుకుపోయారు. మిగతా సినిమా చూడటానికి ధైర్యం చాలలేదు.  అయితే ఆ వీడియో టేప్ చూసినవాళ్లు ఎందుకు చచ్చిపోతున్నారు అనే విషయం తెలుసుకోవాలని అలా కూర్చుండిపోయారు. అవును… ఆ వీడియో టేప్ కు వీళ్ల చావులకు సంభందం ఏమిటి…ఇదే విషయం రియోకో అనే జర్నలిస్ట్ తేల్చాలనుకుంది. ఎందుకంటే అప్పటికే ఆ వీడియో టేప్ వల్ల నలుగురు పైగా టీనేజర్స్ చనిపోయారు. వాళ్లలో తన మేనకోడలు ఒకతె. అది తన పత్రికకు ఓ స్టోరీ కాదు..తన మేనకోడల్లాంటి ఎందరో ప్రాణాలకు సంభందించిన వ్యవహారం.

దాంతో తన మోనకోడలు బస చేసిన ఆ కాటేజి కు వెళ్లింది. అక్కడ ఆ గదిలో వాళ్ళు చూసిన వీడియో క్యాసెట్ అలాగే ఉంది. దాన్ని తీసుకుని జర్నలిస్ట్ ఇనిస్టింక్ తో    ఏముదో అని ప్లే చేసి చూసింది.  ఆ వీడియోలో  ఓ చిన్న పాప.. ఓ పెద్ద బావి… కొన్ని మిస్టిక్‌ సర్రియలిజం ని తలపించే విజువల్స్.

చూస్తే ఏమౌతుంది..ఈ మూఢ నమ్మకాలు పిల్లల్లో ఏంటి అనుకుంది.అయితే వృత్తిలో భాగంగా చూసినా, మామూలుగా చూసినా ఆ వీడియో ప్రభావం తప్పుదు అన్నట్లుగా చూసిన కొద్ది క్షణాల్లోనే ఫోన్ మ్రోగింది..ఉలిక్కిపడింది. ఇంకో ఏడు రోజుల్లో ఆమెకు మరణం ఆత్మవాణి దూరవాణిలో వినిపించింది.  తొలిసారిగా ఆమె భయపడింది.దేన్నైనా ధైర్యంగా డీల్ చేసే …తన మాజీ భర్త సహాయం కోరింది. అతను ఆ వీడియో కాపీ చేసి ఇవ్వమని తీసుకుని  చూసాడు.

అంతే  చూడటం పూర్తైన వెంటనే అతనికి ఫోన్ కాల్ వచ్చింది..ఏడు రోజులు గడువు . ఏమిటీ మిస్టరీ అని ఆ జంట తేల్చాలనుకున్నారు. మూలాలు వెతుక్కుంటూ వెళ్ళారు. అయితే ఈ లోగా ఇంకో ప్రమాదం . ఆరేళ్ల ఆమె కొడుకు ఇంట్లో ఉన్న ఆ వీడియోని తోచక చూసేసాడు. అక్కడ నుంచి అసలు టెన్షన్ మొదలైంది. నిజంగా వీడియో చూసిన వాళ్లు ఏడు రోజుల్లో చనిపోతారా…త్వరగా ఈ మిస్టరీని ఏడు రోజుల్లో తేల్చకపోతే తను, తన మాజీ భర్త, తన కొడుకు ముగ్గురుకు మృత్యువు తప్పదా…ఆమెలో పరుగెడుతున్న ఆలోచనలు…నిజంగా ఆ ఫోన్ కాల్ లో చెప్పింది నిజమైతే తన ప్రాణాలు అడ్డేసి అయినా తన కొడుకుని రక్షించుకోవాలి. కాలంతో పరుగు. రాత్రింబవళ్లు ఆ మిస్టరీ ని విడతీయటానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది.

చివరకు వెతగ్గా వెతగ్గా ..పాత పేపర్లలో ..తను వీడియోలో చూసిన విజువల్స్ కొన్ని ఆధారంగా కనపడ్డాయి. అంతే ఆ ప్రాంతం వెతుక్కుంటూ వెళ్లింది. అక్కడ జరిగిన కొన్ని దారుణాలు తెలుసుకుంది. ఆ దారుణం ఫలితంగా… ఓ చిన్న పాపని బలవంతంగా చంపేసి బావిలో పడేసారని తెలుసుకుంది. తన  దుఃఖం ప్రపంచ వ్యాప్తం చేయాలని ఆ చిన్నారి ఆత్మ వేదనతో అలమటిస్తూ,పగతో రగిలిపోతూ…వీడియో క్యాసెట్ ద్వారా అందరికీ  తెలియచేసే ప్రయత్నం చేస్తోందని, తెలుసుకుని …దానికి శాంతి చేయాలనుకుంది. ఆ పాప శవాన్ని ఆ బావి నుంచి బయిటకు తీసి స్వేచ్చ ఇచ్చింది. కానీ ఆ ఆత్మ అంత త్వరగా శాంతిస్తుందా…ఎందుకంటే తను ఎప్పుటికి నిద్రపోదు…

మరో ప్రక్క మృత్యువు పెట్టిన గడువు…ఏడు రోజులు గడిచిపోతున్నాయి.  ఈ లోగా ఊహించని విధంగా ఆమె బోయ్ ఫ్రెండ్ మరణించాడు. అంటే ఓ చావు ..మొదలైంది. ఇక ఇప్పుడు తను, తన కొడుకు బ్రతకాలి…ఎలా …అప్పుడు ఆమెకు గుర్తు వచ్చింది. తను … మొదట చూసిన తర్వాతే తన మాజీ భర్త ఆ వీడియో కాపీ తీసుకుని చూసాడు…కానీ అతనే ముందు చనిపోయాడు. తను ఇంకా బ్రతికే ఉంది…తను బ్రతికి ఉండటానికి కారణం తెలిస్తే తన కొడుకుని బ్రతికించుకోవచ్చు…నిజానికి అప్పటివరకూ జరిగిన కథలోనే ఆ సమస్యని పరిష్కరించే ఎలిమెంట్ ఉంది. ఆ మిస్టరీలో ఉన్న అసలు మెలిక ఏమిటి…కొడుకుని ఎలా రక్షించుకుంది అనేది ఓ పొడుపు కథ విప్పటం లాంటి క్లైమాక్స్.

రీమేక్‌ల ప్రభంజనం…

కేవలం1.2 మిలియన్ డాలర్లతో నిర్మితమైన  ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే…130  మిలియన్ డాలర్లు దాటి తెచ్చిపెట్టింది. జపాన్ లో హైయిస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా హాలీవుడ్ లోనూ ది రింగ్ పేరుతో రీమేక్ అయ్యి..మెగా హిట్ అయ్యింది.  దాంతో మార్కెట్ లేక,బడ్జెట్ లు లేక ఉసూరు మంటున్న జపాన్ హర్రర్ మూవీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ఓ గుర్తింపు వచ్చింది. అప్పటివరకూ వచ్చిన జపాన్.. హిట్ హర్రర్ సినిమాలు రీమేక్ రైట్స్ హాలీవుడ్ నిర్మాతలు ఎగబడి రీమేక్ లు చేసారు. కొరియా, ధాయిలాండ్, చైనా,హాంకాంగ్ దేశాల్లో ఈ సినిమా రీమేక్ లతో ప్రభంజనం సృష్టించింది.

ఇక ఈ సినిమా హాలీవుడ్ వెర్షన్ ది రింగ్ .. డీవిడీ  రిలీజైనప్పుడు ఒక్క అమెరికాలో  24 గంటల్లో  2 మిలియన్ డీవిడిలు అమ్ముడయ్యి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ హర్రర్ సినిమాకు ఆ స్దాయి గుర్తింపు, విజయం రావటానికి కారణం ఏమిటి…

నవలగా సూపర్ హిట్…

1991లో   కోజీ సుజుకీ   రింగ్ నవల రాసారు. నవల పెద్ద హిట్. ఆయన్ను రైట్స్ కోసం ప్రొడ్యూసర్స్ కలిసారు. అయితే ఆ కోజీ సుజుకీ  …తన సృజనకు డైరక్టర్ Hideo Nakata అయితే న్యాయం జరుగుతుందని ఒప్పించి చేసారు. చిత్రం ఏమిటీ అంటే… Hideo Nakata అప్పటికి   కేవలం ఒక సినిమా మాత్రమే డైరక్ట్ చేసారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ   కోజీ సుజుకీకు ఆ సినిమా నచ్చటం కలిసొచ్చింది. అయితే నవలకూ సినిమాకు చాలా మార్పులు చేసారు దర్శకుడు. నవల చదివిన చాలా మంది సినిమా చూడటానికి ఇష్టపడలేదట. అయితే సినిమా అద్బుతంగా టాక్ వచ్చాక వెళ్లి చూసి, నవల కన్నా గొప్పగా ఉందని మెచ్చుకున్నారట.

ring-movie2ఎత్తుగడే.. నిలబెట్టేసింది…

సినిమా ప్రారంభంలో కథలో కీలకమైన  ఫియర్ ఫాక్టర్ ఎలిమెంట్  వీడియో టేప్  ని పరిచయం చేసేయటంతో … అప్పటి నుంచే ఓ రకమైన భయం మన మనస్సును ఆక్రమించటం మొదలెడుతుంది.

సినిమాలో ఏమేం మార్పులు చేశారంటే…

ఈ విషయమై దర్శకుడు వివరిస్తూ… ఒరిజనల్ రింగ్ నవల.. హర్రర్ మిస్టరీ. అందులో మెయిన్ కీ ఎలిమెంట్.. సైకో మీటర్ అనే పరికరం. ఆ సైకో మీటర్ ద్వారా ఎదుటి వ్యక్తి ఆలోచనలను చదవచ్చు అని రాశారు.  దాన్ని విజువల్‌గా చూపెడితే బిలీవబులిటి పోవటమే కాక, చూసేవారి దృష్టి, ఆలోచనలు దాని చుట్టూ తిరిగి మేం చెప్పే కథపై దృష్టి పోతుందని వద్దనుకున్నాం.

అలాగే నవల్లో కథ హీరో చుట్టూ తిరుగుతుంది. దాన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ గా మార్చాం. ఎందుకంటే పిల్లలు, స్త్రీలు, బలహీనులైన మగవాళ్లు అయితేనే హర్రర్ కథలు పండుతాయని రుజువైన ఓ నమ్మకం.

అలాగే వీడియో చూస్తే వారం రోజుల్లో చనిపోతారనే రూమర్ .. చాలా అర్బన్ హైస్కూల్ స్టూడెంట్స్‌లో  చాలా కాలం నుంచి  ప్రచారంలో ఉంది. దాంతో దాన్ని యాజటీజ్ సినిమాకు ఎడాప్ట్ చేశాం. అయితే ఆ విషయంలో అంత ఎగ్జాక్ట్ గా ఫోన్ కాల్ వచ్చిన వారంలో ఎలా చనిపోతారు? అంటూ నిర్మాతలు  ప్రశ్నించారు. అయితే కథని కథలాగే చూడాలని, లాజిక్‌లు లాగవద్దని  చెప్పి ఒప్పించాను. అదే మంచి ఫలితాన్ని ఇచ్చింది. సినిమా చూసేవాళ్లకు ఎవరికీ ఆ డౌట్ రాలేదు.

ఇక నవల సక్సెస్ సినిమాకు ఉపయోగపడిందా.. లేదా సినిమా హిట్.. నవల సేల్స్ కు ఉపయోగపడిందా అని అడిగితే.. రెండూ జరిగాయంటాను అంటారు దర్శకుడు. సినిమా తీయటానికి ముందే నవల పెద్ద హిట్.. ఐదు లక్షలు కాపీల దాకా అమ్ముడయ్యాయి. అది నా సినిమా ఓపెనింగ్స్‌కు ఉపయోగపడింది. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక మరో  1.5 మిలియన్ల నవలలు అమ్ముడుపోయాయి. అలా సినిమా కూడా నవల సేల్స్ పెరగటానికి కలిసొచ్చింది.

హాలీవుడ్ రీమేక్ విషయానికి వస్తే…

మౌస్ హంట్, పైరైట్స్ ఆఫ్ ది కరేబియన్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు గోర్ విబిన్ స్కీ కు ఈ సినిమా రీమేక్ ఆఫర్ వచ్చింది. ఆయన జపాన్ ఒరిజనల్ సినిమా చూద్దాంటే…ఓ వీహెచ్ ఎస్ టేప్ మాత్రమే దొరికింది. అదీ పూర్ క్వాలిటీ. అయితే అలా చూడటమే కలిసొచ్చింది అంటారు గోర్ విబిన్ స్కీ. చాలా మిస్టిక్ గా అనిపించి, అది చూస్తున్నప్పుడే చాలా ఐడియాలు వచ్చాయని అంటారు.

ముఖ్యంగా సినిమా మొత్తం ఎక్కడ చూసినా రింగ్ అనే టైటిల్ కు తగ్గట్లు…వృత్తాలు అవకాసం ఉన్న ప్రతీ ఫ్రేమ్ లో కనపడేలా చేయటం తనకు వచ్చిన బెస్ట్ ఐడియా అంటారు.

ఇక ఈ సినిమాలో వాడిన విజువల్ స్టైల్స్ కి మూలం అమెరికన్ ఆర్టిస్ట్ ఆండ్రూ వెయిల్త్ గీసిన ఒంటిరితనం ప్రతిబింబించే పెయింటింగ్స్.

అదిరిపోయే ‘పబ్లిసిటీ ప్లాన్’…

హాలీవుడ్ వెర్షన్ పబ్లిసిటి నిమిత్తం ..నిర్మాతలు సూపర్ ప్లాన్ చేసారు. అప్పటి టీవిల్లో ఈ సినిమా వీసీపీలో కనిపించి భయపెట్టే విజువల్స్ ని వదిలారు..ఇదో సినిమా విషయం అని చెప్పకుండా. దాంతో సెన్సేషన్ అయ్యింది. అలాగే..కొన్ని సెలక్ట్ చేసిన ప్రాంతాల్లో ఆ వీడియో కాపీలు విడిచారు. దాంతో అవేంటో జనాలకి అర్దం కాక తర్వాత తెలుసుకుని ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అలా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.

ఆత్మ.. రీమేక్ లో దెయ్యమైంది…

ఒరిజనల్ కు హాలీవుడ్ రీమేక్ కు చాలా భాగం మార్పులు చేసారు. ఈ విషయమై జపాన్ దర్శకుడు మాట్లాడుతూ.. మేము …కథలో ప్లాష్ బ్యాక్ లో వచ్చే …పగతో రగిలే ఆత్మ గా గతంలో ఈ భూమిపై ఉన్న మనలాంటి ఓ హ్యూమన్ బీయింగ్ , దాని పగని తీర్చుకోవటం సహజంగా, ఓ న్యాయంగా…  భావించి డిజైన్ చేసాం. అదే హాలీవుడ్ వాళ్లు దాన్ని ఓ దెయ్యంగా ఓ నెగిటివ్ ఫోర్స్ గా ..దాన్ని ఎలాగైనా అణచాలి అన్నట్లుగా చూపెట్టారు.

అలాగే మేము ఆత్మ ఎలా ఉంటుందనేది  చూసే వారి ఊహకు ఎలా ఉంటుందని వదిలేసాం. హాలీవుడ్ వాళ్లు ఆ ముఖాన్ని  చూపెట్టాసారు. దాంతో ప్రేక్షకులు ఏం ఊహించుకోగలరు. వారి మనస్సులో ఉన్న డార్క్ షేడ్స్ కు ఆకారం ఇచ్చుకోవద్దా… ఈ రెండు ఎలిమెంట్స్  నచ్చలేదు. మిగతా ఇంప్రవైజేషన్స్ అద్బుతం అన్నారు. మాకున్న లోబడ్జెట్ లో రెండు గంటల్లో తీసిన సీన్స్ వాళ్లు వారం రోజులు పాటు ఖర్చు పెట్టి తీసారు.

తీసేటప్పుడు ఎంజాయ్ చేశారా?

హర్రర్ సినిమా తీయటంలో ఆనందం ఏమీ ఉండదు..తీసేటప్పుడు మన మెదడులోని కొన్ని చీకటి గదుల్లోకి వెళ్లి వస్తాం..తర్వాత చాలా రోజులు ఆ డిప్రెషన్ ఉండిపోతుంది అంటారు హాలీవుడ్ రీమేక్ దర్శకుడు.  జపాన్ దర్శకుడు అయితే తనకు మంచి లవ్ స్టోరీ తియ్యాలని ఉందని, అయితే అన్ని ఇలాంటి హారర్ ఆఫర్సే వస్తున్నాయని వాపోయారు.

ఆ సీన్స్ తీసేశారు…

హాలీవుడ్ రీమేక్ లో ఓ పేరున్న ఆర్టిస్ట్ క్రిస్ కూపర్ ని గెస్ట్ గా తీసుకుని రెండు సీన్స్ షూట్ చేసారు. కథ ప్రకారం అతనో చైల్డ్ మర్డరర్..అతనికి సినిమా చివర్లో ఈ దెయ్యం.. వీడియో క్యాసెట్ ని ఇస్తారు. అయితే టెస్ట్ స్క్రీనింగ్ జరిగినప్పుడు చాలా మంది ఆడియన్స్…అంత పెద్ద ఆర్టిస్ట్ ఆ కొద్ది సేపే ఉండటం ఏమిటని చర్చ మొదలెట్టారు. దాంతో అసలు విషయం డైవర్ట్ అవుతోందని దర్శకుడు డెసిషన్ తీసుకుని ఆ చివర సీన్స్ తీసేసి ఫైనల్ వెర్షన్ రిలీజ్ చేశారు.

ఇప్పుడైతే…

ఈ సినిమా చేసే రోజుల నాటికి మొబైల్ ఫోన్స్ లేవు. కేవలం హౌస్ పోన్స్ ..అంటే లాండ్ లైన్ ఫోన్స్ మాత్రమే ఉండేవి. ఎవరైనా ఫోన్ లో మాట్లాడాలంటే ఓ ఇంటి నుంచైనా లేదా.. ఫోన్ బూత్ నుంచైనా మాట్లాడాలి. ఈ రోజుల్లో ఈ కథని అసలు ఊహించలేము, ఎందుకంటే సెల్ ఫోన్ తో ఎక్కడ నుంచైనా మాట్లాడచ్చు కదా.

టైమ్ లెస్ టెర్రర్…

ఇంతకాలం హర్రర్ సినిమా అనగానే  రాత్రి పన్నెండు గంటలకు దెయ్యం రావడం, అందరూ భయపడటం , అద్దంలో మొహం కనపడకపోవటం, ఎవరినో ఒకరిని ఆవహించటం, సౌండ్ ఎఫెక్ట్ లతో భయపెట్టడం వంటివి జరుగుతూంటాయి. కానీ ఈ సినిమాలో అవేమీ ఉండవు. చూసినప్పుడు హర్రర్ తో కూడిన  ఓ చక్కటి థ్రిల్లర్ చూస్తున్నట్లు ఉంటుంది. హిచ్ కాక్ సినిమాని హర్రర్ మోడ్ లో రెడీ చేసినట్లుంది.

ఓవరాల్ గా..‘Ring’  సినిమా సైక్లాజికల్ గా చాలా డిస్ట్రబ్ చేసే సినిమా, ఎక్కడా జంప్ లు, భయపెట్టే ఫేక్ సీన్స్ లేకుండా..కేవలం సస్పెన్స్ ని బిల్డ్ చేస్తూ చూసే వాళ్లలో టెన్షన్ పుట్టిస్తూ సాగుతుంది.

అయితే సినిమా చూశాక.. ఫోన్ ఎత్తాలన్నా… వీహెచ్‌ఎస్ క్యాసెట్ చూడాలన్నా కొద్ది రోజుల వరకూ భయం పుట్టించే సైక్లాజికల్ ప్లే ఉంటుంది. ముఖ్యంగా ఇలా ఓ పొడుపు కథలాంటి ట్విస్ట్ ఏ సినిమాలోనూ మీకు కనిపించదు. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక మరో సారి సినిమా చూడాలనిపిస్తుంది. అదే ఈ సినిమా సక్సెస్ కు కారణం అనిపిస్తుంది. ఈ సినిమా యూట్యూబ్ లో దొరుకుతోంది. చూసి ఆ పొడుపు కథని విప్పుతూ ఎంజాయ్ చేయండి.

josyula surya prakash

– సూర్యప్రకాష్ జోశ్యుల