జేమ్స్‌బాండ్ వస్తున్నాడు! 25వ సినిమాగా ‘నో టైమ్ టు డై’…

4:04 pm, Mon, 7 October 19
James-Bond-25-film-No-Time-To-Die

వాషింగ్టన్: జేమ్స్‌బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు రాగా.. అవన్నీ కూడా విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో జేమ్స్‌బాండ్ 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ‌కూడా విడుదలైంది. 

ఎప్పటికప్పుడు సరికొత్త కథనంతో, అనుక్షణం ఉత్కంఠ కలిగిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా ఉంటాయి జేమ్స్‌బాండ్ సినిమాలు. రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షలకులు ఎదురుచూస్తుంటారు. సాధారణంగా జేమ్స్‌బాండ్ పాత్రధారిని ప్రతి నాలుగు సినిమాలకు మార్చేస్తూ ఉంటారు. 

సంప్రదాయాన్ని పక్కనబెట్టి…

పియర్స్ బ్రాస్నన్ కూడా నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాల్లోనే నటించాడు. ఆ తరువాత కొత్త జేమ్స్‌బాండ్‌గా డేనియల్ క్రేగ్ అవతరించాడు. ఇతడు కూడా నాలుగు సినిమాల్లో నటించేశాడు. అయితే సంప్రదాయాన్ని పక్కనబెట్టి ఐదో సినిమాకు కూడా ఇతడినే కథానాయకుడిగా ఎంపిక చేశారు.

ఇక ఈ సినిమాకు టైటిల్ ఎంపికలో కూడా చాలా కసరత్తు జరిగింది. తొలుత ‘షట్టర్ హ్యాండ్స్’, ‘ఎక్లిప్స్’, ‘ఏ రీజన్ టు డై’ అనే టైటిళ్లను పరిశీలించిన చిత్ర బృందం ఫైనల్‌గా ‘నో టైమ్ టు డై’ను ఖరారు చేసింది. 

క్యారీ జోజీ ఫుకునాగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ 25వ జేమ్స్‌బాండ్ చిత్రాన్ని బ్రిటన్, ఇండియాలో 2020 ఏప్రిల్ 3న, అమెరికాలో ఏప్రిల్ 8న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ బృందం యోచిస్తోంది. ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!