ప్రముఖ సాహితీ వేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కన్నుమూత

- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా ఉన్న ఇంద్రగంటి మోహనకృష్ణ ఆయన కుమారుడే.

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో 29 మే 1944న జన్మించిన శ్రీకాంత శర్మ 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్‌గా రెండు దశాబ్దాలు పనిచేశారు. లలిత గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలు రచించారు. ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికలో ఉప సంపాదకుడిగా, ‘ఆంధ్రప్రభ’లో సంపాదకుడిగా పనిచేశారు. ‘కృష్ణావతారం’, ‘నెలవంక’, ‘రావుగోపాలరావు’, ‘రెండుజెళ్ల సీత’, ‘పుత్తడిబొమ్మ’, ‘చైతన్యరథం’ వంటి చిత్రాలకు శ్రీకాంత శర్మ పాటలు రాశారు. తన కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాలోని పాటలు రాసింది కూడా ఆయనే.

ప్రముఖ కథారచయిత్రి జానకీబాలను 1966లో శ్రీకాంత శర్మ వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు కాగా, కుమార్తె డాక్యుమెంటరీ, లఘుచిత్రాలు తీసి అవార్డులు పొందారు. శ్రీకాంత శర్మ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు సాహిత్య ప్రపంచం శ్రీకాంత్ శర్మ లాంటి ఓ మేధావిని కోల్పోయిందని నటుడు నాని ట్వీట్ చేశాడు. మోహనకృష్ణ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపాడు.

- Advertisement -