అమెరికాలో దుమ్మురేపుతోన్న ‘గీత గోవిందం’, మెగాస్టార్ సినిమాను దాటేసి మరీ…

1:06 pm, Fri, 5 October 18
geeta-govindam

geetha-govindam

వాషింగ్టన్: విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘గీత గోవిందం’ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అటు ఓవర్సీస్‌లోనూ దుమ్ము రేపుతోంది. అమెరికాలో పెద్ద హీరోల చిత్రాలకు ధీటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రం తాజాగా మెగాస్టార్ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాను కూడా దాటేసిందట.

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ఓవర్సీస్‌లోనూ అదే వూపును ప్రదర్శిస్తోంది. ఈ చిత్రం విడుదలై నాలుగు వారాలు పూర్తవుతోన్నా.. ఇంకా అమెరికాలో వసూళ్ల పరంపర కొనసాగిస్తూనే ఉంది.

అమెరికా టాప్-10 టాలీవుడ్ చిత్రాల్లో…

గత వారం 2 మిలియన్ మార్క్ సాధించిన ‘గీత గోవిందం’ చిత్రం.. అమెరికా టాప్-10 టాలీవుడ్ చిత్రాల్లో చోటు దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.447 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్-9లో ఉన్న ‘ఫిదా’ను టాప్-10కు, టాప్-8లో ఉన్న ‘ఖైదీ నంబర్ 150’ని టాప్-9కి పంపంచి.. ప్రస్తుతానికి టాప్-8లో సెటిలయ్యింది.

‘గీత గోవిందం’ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే.. త్వరలో ఓవర్సీస్‌లో ‘అ..ఆ’, ‘మహానటి’ కలెక్షన్లను కూడా ఈజీగా దాటేసి.. ఏకంగా టాప్-6 స్థానానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఓవర్సీస్ రికార్డుల విషయానికొస్తే టాప్-1 అండ్ 2 స్థానాల్లో‘బాహుబలి’ సిరీస్ చిత్రాలు కొనసాగుతుండగా.. టాప్-3 స్థానంలో ‘రంగస్థలం’, టాప్-4,5 స్థానాల్లో ‘భరత్ అనే నేను’, ‘శ్రీమంతుడు’ ఉన్నాయి. మరి ‘గీత గోవిందం’ ఊపు చూస్తోంటే.. ఫైనల్ లెక్కలు తేలే లోగా ఇంకెన్ని రికార్డులు విజయ్ దేవరకొండ ఖాతాలో చేరతాయో చూడాలి.