జగన్‌కి శరద్ పవార్ ఫోన్…..బీజేపీయేతర పక్షంలోకి ఆహ్వానం..

- Advertisement -

ముంబై: మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న విషయం తెల్సిందే. ఈ ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని అటు బీజేపీ హయాంలోని ఎన్డీయే పక్షాలు ధీమాగా ఉన్నాయి.

గత ఆదివారం  సాయంత్రం వెలువడిన అన్నీ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీయేనే అధికారంలోకి రాబోతుందని తేల్చేశాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్‌ను విశ్వసించని కాంగ్రెస్ నేతలు హంగ్ తప్పదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలను తమతో కలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటు ఏపీలో జగన్ అధికారంలోకి వస్తున్నారని, ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటున్నారని వివిధ జాతీయ చానళ్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడించాయి. దీంతో ఆదివారం జగన్‌కు ఫోన్ చేసిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీయే యేతర కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది.

అలాగే, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ సోమవారం జగన్‌కు ఫోన్ చేసి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారని సమాచారం. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని జగన్ బదులిచ్చినట్టు తెలుస్తోంది.

చదవండి: కేంద్రంలో బీజేపీ వ్యూహమేంటి? కేసీఆర్, జగన్‌లను ఆహ్వానిస్తుందా?
- Advertisement -