బాలీవుడ్‌ను పీడిస్తోన్న కేన్సర్.. గుండె పగిలే వార్త చెప్పిన హృతిక్ రోషన్

1:46 pm, Wed, 9 January 19
rajesh roshan cancer surgery

ముంబై: బాలీవుడ్ చిత్రపరిశ్రమను ఇప్పుడు కేన్సర్ భూతంలా పట్టిపీడిస్తోంది. ఇప్పటికే పలువురు నటీనటులు దాని బారినపడగా తాజాగా స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి, వెటరన్ డైరెక్టర్ రాకేశ్ రోషన్ దాని బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు హృతిక్ స్వయంగా వెల్లడించాడు. తన తండ్రి గొంతు కేన్సర్ బారిన పడినట్టు హృతిక్ వెల్లడించాడు. ప్రస్తుతం అది ప్రాథమిక దశలోనే ఉన్నట్టు తెలిపాడు.

హృతిక్ ప్రకటనతో బాలీవుడ్ నివ్వెరపోయింది. రాకేశ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా నిండా కామెంట్లు వెల్లువెత్తాయి. విషయం తెలిసిన ప్రధాని మోదీ కూడా రాకేశ్ రోషన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. రాకేశ్ రోషన్ ఫైటర్ అని, ఆయనలో ధైర్య సాహసాలు పుష్కలంగా ఉన్నాయన్న ప్రధాని కేన్సర్‌తో ఫైట్ చేసి విజయం సాధిస్తారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

కోలుకుంటున్న రాకేశ్ రోషన్..

రాకేశ్ రోషన్ సోదరుడు రాజేశ్ రోషన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాకేశ్ రోషన్ బాగానే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నామని, ఆపరషన్ సమయంలో ఎంతో ఆందోళన చెందామని పేర్కొన్నారు. మరో మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పినట్టు రాజేశ్ తెలిపారు.

తన తండ్రి చాలా ధైర్యవంతుడన్న సంగతి తెలుసని పేర్కొన్న హృతిక్.. ఈ ఉదయం గుడ్ మార్నింగ్ కోసం తన తండ్రిని ఓ ఫొటో అడిగినట్టు చెప్పాడు. ఆపరేషన్ రోజు కూడా ఆయన జిమ్‌కు వెళ్లడం మర్చిపోలేదని పేర్కొన్నాడు. ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ (గొంతు కేన్సర్) ప్రాథమిక దశలో ఉండగానే గుర్తించినట్టు చెప్పాడు.

ప్రస్తుతం ఆయన కేన్సర్‌తో యుద్ధం చేస్తున్నారని, తప్పకుండా జయించి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. చివర్లో ‘లవ్ యూ డాడ్’ అని పేర్కొన్నాడు.

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో కేన్సర్ బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. నటుడు ఇర్ఫాన్ ఖాన్, సోనాలి బెంద్రే, ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్, నఫీసా అలియా, రిషీ కపూర్ వంటి వారు కేన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. నటి మనీషా కొయిరాలా కూడా కేన్సర్ బారిన పడినా ప్రస్తుతం ఆమె కోలుకుంది.