బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం

2:44 pm, Wed, 7 August 19

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన తాత జే ఓం ప్రకాష్ నేడు ముంబైలో కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక నిర్మాతల్లో ఒకరైన జే ఓం ప్రకాష్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చాలా చిత్రాలు A అక్షరంతో ప్రారంభం కావడం విశేషం.

ఆయన నిర్మాణంలో 1960-1980 మధ్య పలు హిట్ చిత్రాలు తెరకెక్కాయి. అందులో ‘ఆప్ కీ కసమ్’, ‘ఆహిర్ క్యోన్’, ‘అర్పన్’, ‘ఆయే మిలన్ కీ బేలా’, ‘ఆయే దిన్ బహార్ కే’, ‘అప్నా బనాలో’, ‘ఆషా’, ‘అప్నాపన్’ అనే చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఓం ప్రకాష్ నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా పలు చిత్రాకు దర్శకత్వం వహించారు.

రాజేష్ ఖన్నా హీరోగా ‘ఆప్ కీ కసమ్’ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు అప్పటి బాలీవుడ్ అగ్ర హీరో జితేంద్రతో కూడా పలు హిట్ చిత్రాలను నిర్మించారు.1995 నుంచి 1996 వరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కుమారుడు రాకేష్ రోషన్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు.

మరో కుమారుడు రాజేష్ రోషన్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రికి A అక్షరం ఎలా సెంటిమెంట్ అయిందో, రాకేష్ రోషన్‌కు K అక్షరం అలా మారింది. ఆ అక్షరతో ఆయన ఎక్కువ సినిమాలు తెరకెక్కించారు. అందులో ‘కాలా బజార్’, ‘కామ్ చోర్’, ‘కరణ్ అర్జున్’, ‘కోయిలా’ ‘కహో నా ప్యార్ హై’, క్రిష్, ‘కోయి మిల్ గయా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.

ఆయా సినిమాలకు ఆయన సోదరుడు రాజేష్ రోషన్ సంగీతం అందించారు. హృతిక్ రోషన్ హీరోగా సక్సెస్ అందుకున్న చిత్రాలు కూడా తండ్రి రాకేశ్ రోషన్ దర్శక నిర్మాణంలో తెరకెక్కినవే. తన తాత కన్నుమూయడంతో ఆయన 92వ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను హృతిక్ షేర్ చేశాడు. ఆయన తనలో ఉన్న బలహీనతలను అధిగమించి ముందుకు నడిచేలా నన్ను ప్రోత్సహించారంటూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.