‘జగన్ వస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లూ గల్లంతే, నన్ను తిట్టడానికే మోడీ..’

chandrababu naidu
- Advertisement -

chandrababu
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పార్టీకి అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా దొంగ ఓట్లుగా చిత్రీకరించి వారి పేర్లను తొలగించే ప్రయత్నం చేస్తారని ధ్వజమెత్తారు.

శనివారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. డివిజన్ లేని మాయా జోన్ ప్రకటించి ఏదో త్యాగం చేసినట్లు ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రధానికి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువని, స్వార్థం కోసం దేశాన్నే పణంగా పెట్టే వ్యక్తి మోడీ అని చంద్రబాబు దుయ్యబట్టారు. మనల్ని తిట్టడానికే ఆయన విశాఖ వచ్చారని విమర్శించారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటానన్న మోడీ.. జగన్‌తో ఎలా జట్టు కట్టారని ప్రశ్నించారు.

కేసీఆర్-మోడీ-జగన్‌ ముసుగు తీయాలి…

కేసీఆర్-మోడీ-జగన్‌ ధైర్యం ఉంటే ముసుగు తొలగించి రాష్ట్రంలో పోటీ చేయాలంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. బీహార్‌కు చెందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని మోడీ- జగన్‌ తమ కన్సల్టెంట్‌గా పెట్టుకుని రాష్ట్రాన్ని మరో బీహార్‌ చేద్దామనే కుట్రను పన్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి కుట్రలను జరగనివ్వబోమని చెప్పారు.

రాష్ట్ర భవిష్యత్ ఆకాంక్షించే వ్యక్తులంతా తెదేపాలో చేరుతున్నారని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని తెలిపారు. ప్రజల మనోభావాలకు తగ్గట్లే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, దీనిపై కొందరు క్రమశిక్షణ తప్పి గోల చేయడం సరికాదని సొంత పార్టీ నేతలకు చంద్రబాబు హితవు పలికారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని కోరారు.

చదవండి: దేశాన్ని బలహీనపర్చొద్దు, అవినీతిపరుల ఆటలు సాగవు: మోడీ హెచ్చరిక

- Advertisement -