ఎంతో పొందాను.. ఇంకెంతో కోల్పోయాను, అందుకే నటనకు గుడ్ బై!: ‘దంగల్’ ఫేమ్ జైరా వాసిం

1:05 am, Wed, 3 July 19
zaira-wasim

ముంబై: బాలీవుడ్ నటి జైరా వాసిం అనూహ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించింది. తన వృత్తికి, తన మతానికి మధ్యన తాను నలిగిపోయానని, ఈ పోరాటంలో తాను అలసిపోయానని, అందుకే తాను చిత్ర పరిశ్రమ నుంచి, నటన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఆదివారం తన ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది.

18 ఏళ్ల జైరా వాసిం కశ్మీర్‌లో పుట్టిపెరిగింది. తన 13 ఏళ్ల వయసులో అనుకోకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆమె తొలి చిత్రం ‘దంగల్’. అందులో అమీర్ ఖాన్‌తో కలిసి నటించడమే గ్రేట్ అనుకుంటే.. ఆ చిత్రంతో ఉత్తమ సహాయ నటిగా ఆమె ఏకంగా జాతీయ పురస్కారమే అందుకుంది. ఆమె ప్రతిభ చూసి అమీర్ ఖాన్ ఆమెతో ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రం నిర్మించడమే కాక అందులో సహాయ పాత్రలో కూడా నటించారు.

మూడో చిత్రం విడుదల కాకమునుపే…

ఇక తన మూడో చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’లో బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రాతో కలిసి నటించే అవకాశం జైరాకు దక్కిందంటే నటనలో ఆమె ప్రతిభ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె నటించిన మూడో చిత్రం ఇంకా విడుదల కానేలేదు.. అంతలోనే జైరా వాసిం తాను సినీ పరిశ్రమకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి ఇటు బాలీవుడ్‌ను, అటు తన అభిమానులను షాక్‌కు గురిచేసింది.

బాలీవుడ్ తనకెంతో ప్రేమను, అండను, గుర్తింపును ఇచ్చిందని, కానీ ఇదే రంగం తనను తన మతానికి, అల్లాతో తన బంధానికి దూరం చేసిందని జైరా తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొంది. తనకు తెలియకుండానే తాను తన మత విశ్వాసాలకు దూరమైపోయానని విచారం వ్యక్తం చేసింది. సినీరంగం తన మత విశ్వాసానికి, అల్లాతో తన బంధానికి ఎంతో భంగం కలిగించిందని, ఫలితంగా తనకు మనశ్శాంతి కరవైందని జైరా వాసిం పేర్కొంది.

ఎన్నో ఇబ్బందులు.. మరెన్నో బెదిరింపులు…

నిజానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తనకు ఎంతో మద్దతు ఇవ్వడంతో పాటు ప్రేమను, ప్రోత్సాహాన్ని ఇచ్చిందని జైరా వాసిం పేర్కొంది. ఈ క్రమంలో తాను కొన్ని ఊహించని పరిణామాలు కూడా ఎదుర్కొన్నానని, అదే ఈ ఇండస్ట్రీపై తనకు నమ్మకం కోల్పోయేలా చేసిందని తెలిపింది. ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని కావడం వల్ల తాను చాలా ఇబ్బందికర పరిస్థితులు, మరెన్నో బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆమె తన ఫేస్‌బుక్ పోస్టులో తెలిపింది.

ఇక కొనసాగాలని అనుకోవడం లేదు…

‘‘ఐదేళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. నేను బాలీవుడ్ చిత్ర సీమలో అడుగు పెట్టినపుడు మంచి గుర్తింపు, పాపులారిటీ వచ్చింది. ఎంతో మంది నన్ను ఆదరించారు. నన్ను యువతకు రోల్ మోడల్‌గా పేర్కొన్నారు. కానీ ఈ వృత్తిలో కొనసాగుతూ నేను చాలా సంఘర్షణను ఎదుర్కొన్నాను..’’ అని ఆమె వ్యాఖ్యానించింది. సినీ రంగానికి తాను సరిపోవచ్చని, కానీ తాను మాత్రం ఈ రంగంలో ఇక కొనసాగాలని అనుకోవడం లేదని పేర్కొంది.

తాను తన అంతరాత్మతో ఎంతో సంఘర్షణకు గురయ్యానని, తన ప్రశాంతతను, విశ్వాసాలను, అల్లాతో తన అనుబంధాన్ని చెడగొట్టే వాతావరణంలో ఇన్నాళ్లూ తాను బలవంతంగా కొనసాగానని, సరైన సమయం వచ్చినప్పుడు దీనికి ముగింపు పలకాలని అనుకున్నానని జైరా తెలిపింది.

‘‘విజయం అనేది భౌతికంగా మనం చూసేది కాదు. మన సృష్టి వెనుక ఉన్న విధిని నిర్వర్తించడమే అసలైన విజయం. నేను ఏ దారిలో నడవాలనే దానిపై నాకు ఒక స్పష్టత వచ్చింది. విజయం, గుర్తింపు, అధికారం, డబ్బు.. ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతత ముందు సరితూగవు..’’ అని ఆమె పేర్కొంది.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన…

మరోవైపు జైరా వాసిం పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేల మంది దీనిపై స్పందిస్తూ కామెంట్లు చేశారు. జైరా వాసిం తీసుకున్న నిర్ణయం, అందుకు ఆమె చూపిన మతం కారణంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబడుతూ కామెంట్లు చేయగా.. మరికొందరు ఆమెను సమర్థించారు.