అసలే ప్లాఫ్ ల్లో ఉన్నాను.. ఏదన్నా హిట్ కథ ఉంటే చెప్పు…
ఓకే… మీరన్నట్లు ఒకసారి హిట్ అవటం ఏమిటి.. బోలెడుసార్లు హిట్ అయిన కథ చెప్తాను…
సూపర్… అన్నిసార్లు హిట్ అయిన కథ.. అయితే ఇంకా సేఫ్…
యస్.. రీమేక్ రైట్స్ లేకుండా రీమేక్ చేసినంత పుణ్యం వస్తుంది.
ఇలాంటి కథలతో ఇంకో సుఖం కూడా ఉంది.. చూసేవాడికి ఎదర ఏం జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుంది.. బుర్ర మీద పెద్ద ఒత్తిడి ఉండదు…
ఇంకే …కథ కూడా చెప్పక్కర్లేదు.. కానీయ్..
ఓకే..కాకపోతే ఓ కండీషన్!
టైటిల్’లో ఎట్టిపరిస్దితుల్లోనూ సున్నా వచ్చేలా చూడు.. అది చాలు…
అలాంటి పంతం, పట్టింపు మీకున్నప్పుడు నేనెందుకు కాదంటా…
అలాంటి సంభాషణతో మొదలైనట్లు అనిపించే ఈ సినిమా.. అసలు కథ, కమామీషు చూద్దాం.
ఇదీ కథ…
విక్రాంత్ (గోపీచంద్) తను చూసిన సినిమాలు ఇన్సిప్రేషన్ ఏమో కానీ అభినవ రాబిన్ హుడ్ లా … ప్లాన్ చేసి పొలిటీషియన్స్ డబ్బులు లేపేసి ఓ అనాధాశ్రమానికి అందజేస్తుంటాడు. తాము నానా చంకా నాకి ప్రజల సొమ్ముని కొట్టేస్తూంటే… ఆ సొమ్ముని సునాయిసంగా కొట్టేస్తున్న ఈ దొంగ ఎవడ్రా బాబు అని అని పొలిటీషియన్స్‌కు పిచ్చ కోపం వస్తుంది.
అవకాశం ఉంటే మరి వాళ్లు ఈ దొంగను కూడా తమ జట్టులో కలుపుకోవటానికి ప్రయత్నం చేద్దురో ఏమో కానీ ఆ ఆలోచన రాక… వాడెవరో పట్టుకోమని ఇన్విస్టిగేటర్స్ ని వదులుతారు. అప్పుడు వారికో విచిత్రమైన నిజం తెలుస్తుంది. ఆ దొంగ మామూలోడు కాదని కోట్లకు పడగలెత్తిన సురానా ఇండస్ట్రీ అధినేత ఆనంద్ సురానా (ముఖేష్ రుషి) కుమారుడని తేలుతుంది.
ఆనంద్ సురానా లండన్‌లో ఉండే భారతీయ వ్యాపారవేత్త.. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. మినిస్టర్లకు కూడా సురానాను కలవాలంటే నెలల సమయం పడుతుంది. అలాంటి సురానా ఫ్యామిలీ వారసుడు విక్రాంత్ సురానా ఎందుకు లండన్ వదిలి ఇండియా వచ్చి ఈ దొంగతనాలు మొదలెట్టాడు? తండ్రి ఏమన్నా … పాకెట్ మనీ ఇవ్వనన్నాడా? లేక అక్కడ అప్పుల పాలై ఇక్కడైతే సులభంగా క్రైమ్ చేసి విజయ్ మాల్యా, నీరవ్ మోడీలా విదేశాలకు వెళ్లిపోవచ్చు అని డిసైడ్ అయి వచ్చాడా?
ఆ ప్లాష్ బ్యాక్ ఏమిటి? ఇతని గురించి తెలిశాక ఆ మినిస్టర్స్ ఏం చేశారు?? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఆ హిట్ సినిమాలకీ.. ఈ సినిమాకీ తేడా
డబ్బున్న వాళ్ల దగ్గర సొమ్ము కొట్టేసి..పేద వాళ్లకు పంచే రాబిన్ హుడ్ క్యారక్టర్ కథలు మనకు కొత్తేమీ కాదు. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మెన్ నుంచి ఈ మధ్యన వచ్చిన రవితేజ ‘కిక్’, రజనీకాంత్ ‘శివాజీ’దాకా అవే కథలు. అంతమందికి వర్కవుట్ అయ్యింది మనకు ఎందుకు కాదనుకున్నాడో ఏమో కానీ గోపీచంద్ తన 25 వ సినిమాకు అదే కథని ఎంచుకున్నాడు.
అయితే వాళ్లంతా …ఆ సినిమాల్లో కేవలం రాబిన్ హుడ్ కాన్సెప్టు ని తీసుకుని దానికి కొత్త నేపధ్యాలను యాడ్ చేసుకుంటూ,కొత్త ప్లాష్ బ్యాక్, సన్నివేశాలు కలుపుకుంటూ వచ్చారు. దాంతో అవి వర్కవుట్ అయ్యాయి. అయితే ఇక్కడ నేపధ్యమూ మార్చలేదు. స్క్రీన్ ప్లే నడక మారలేదు. ఆ హిట్ కథలని కొద్ది పాటి మార్పులతో వాటిలోని మంచి సీన్స్ ని తీసుకుని గోపీచంద్ రీమేక్ చేసాడా అనిపించింది. చూసిన కథను మళ్లీ మళ్లీ చూడాలంటే కష్టమే కదా.
అదే దెబ్బ కొట్టింది…
ఫస్టాఫ్ అంతా హీరో చేసే దొంగతనాలకు కేటాయిస్తే, సెకండాఫ్ …హీరో ఆ దొంగతనాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పే ప్లాష్ బ్యాక్ కు కేటాయించారు. ఇక విలన్స్ కి హీరో ఎవరో ఫలానా అని తెలిసి.. యాక్షన్‌లోకి దిగేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. స్క్రీన్ టైమ్ అయ్యిపోయి క్లైమాక్స్ వచ్చేసింది.
ఇవి బాగానే ఉన్నాయి బాస్..
ఈ సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ బాగోలేదా అంటే..లౌక్యం నుంచి కలిసి వచ్చింది అనుకున్నారో ఏమో పృధ్వీ కామెడీని కంటిన్యూ చేసారు. అలాగే క్లైమాక్స్ బొబ్బిలిపులి లా డైలాగులతో దద్దరిల్లేలా చేసారు. ఆ సీన్ లో ప్రస్దావించిన సోషల్ ఎలిమెంట్స్ ఆలోచింపచేస్తాయి. కాకపోతే అప్పటివరకూ చాలా ఓపిగ్గా ఎదురుచూడాలంతే..
ఉంటే బాగుండేది…
ఫస్టాఫ్ లో ఎంటర్టైన్మెంట్ లాగే సెంకండాఫా కూడా కాస్తంత కామెడీని కలిపితే బాగుండేది.
మిగతా విషయాలు…
గోపీచంద్… కొత్తగానూ చెయ్యలేదు.. చెత్తగానూ చెయ్యలేదు. మెహరీన్ పాటల్లో గ్లామర్ కే పరిమితం. ఫృద్వీ కామెడీ బాగుంది. శ్రీనివాస రెడ్డి ఓకే . టెక్నికల్ గా … ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ గ్రాండియర్‌గా ఉంది. పాటలు బాగోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఆర్ట్ డైరెక్టర్ పనితనం కనపడుతుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
బి, సి సెంటర్లను టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా అక్కడ కొంతవరకూ అదృష్టం పరీక్షించుకోవచ్చు.
ఫైనల్ థాట్…
ఈ మధ్యకాలంలో కొత్త కథలు తెలుగు తెరపై ఆవిష్కారమవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మన పాత తెలుగు సినిమా ఇలా ఉండేది. ఇంతకు ముందు ఇలాంటి కథలు వచ్చేవి అని జ్ఞాపకం చేయాలన్న దర్శకుడు ఆలోచన ప్రశంశనీయం. శెభాషో శభాష్.
రేటింగ్: 2
నటీనటులు: గోపీచంద్, మెహరీన్, పృథ్వీ, తనికెళ్ల భరణి, ‘మిర్చి’ సంపత్, జయప్రకాశ్, ముఖేశ్ రుషి, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాత: కేకే రాధామోహన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.చక్రవర్తి
విడుదల తేదీ: 05-07-2018
– సూర్యప్రకాష్ జోశ్యుల