‘మెహబూబా’ మూవీ రివ్యూ

- Advertisement -

పూరి జగన్నాథ్‌కు హీరోని ఎలా చూపిస్తే జనం విజిల్స్ వేస్తారో తెలుసు.  ఎలాంటి డైలాగులు చెప్పిస్తే జనం రోజుల తరబడి మాట్లాడుకుంటారో తెలుసు. తనదైన శైలిలో పూరి తనతో పనిచేసే హీరోలకు సెపరేట్‌  క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసి అలవోకగా హిట్స్ కొట్టేవారు..(కొడుతున్నారు కాదు).  అంతెందుకు ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌ని హీరోగా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయటానికి  ఫెరఫెక్ట్ ఆప్షన్‌గా కనపడ్డ దర్శకుడు పూరి జగన్నాథ్.

ఆ స్దాయి దర్శకుడు తన కుమారుడుని హీరోగా లాంచ్ చేస్తూ (ఆంధ్రాపోరిని పరిగణనలోకి తీసుకోకపోతే) సినిమా చేస్తే ఇంకెంత గొప్పగా  ఉండాలి.డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఓ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు జనాలకు నచ్చుతుంది. పూరి తన కుమారుడు సినిమాతో తిరిగి  ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉందా?..ఇంతకీ కథేంటి?  పూరి కుమారుడు ఆకాశ్‌‌కు హీరోగా వరస ఆఫర్స్ వస్తాయా?  వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

స్టోరీ లైన్…

హైదరాబాద్‌ లో ఉండే  రోషన్‌ (ఆకాశ్‌)కి  గత జన్మ జ్ఞాపకాలు కల రూపంలో  వెంటాడుతుంటాయి. ఆ  జ్ఞాపకాల్లో అతనో సైనికుడు అని విఫల ప్రేమికుడు అని అర్దమవుతుంది. అంతేకాదు  తనకి  హిమాలయాలతో ఏదో బంధం ఉందని గ్రహించి అందరితో చెబుతుంటాడు. మరో ప్రక్క పాకిస్దాన్ లోని  లాహోర్‌ లో ఉన్న అఫ్రీన్‌ (నేహా శెట్టి) ది కూడా అదే పరిస్దితి. ఆమెకు కూడా ఇలాంటి గత జన్మ  జ్ఞాపకాలు కల రూపంలో కనపడి భయపెడుతూంటాయి తనను ఎవరో చంపేసారని భయపడుతుంటుంది ‌.

ఈ లోగా అఫ్రీన్ కు ఓ సంభంధం సెటిల్ అవుతుంది. కానీ చదువునిమిత్తం హైదరాబాద్  వస్తుంది. అక్కడ రోషన్ పరిచయం అయ్యి ఓ ప్రమాదం నుంచి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరికి ఏదో అనుభంధం ఉందని అర్దం చేసుకుంటారు. అంతేకాదు ట్రెక్కింక్ కు హిమాలయాలకు వెళ్లిన రోషన్ కు అక్కడ ఆ మంచు కొండల్లో చనిపోయి ,బిగుసుకుపోయిన  అఫ్రీన్‌ లాంటి అమ్మాయి కనపడుతుంది. షాక్ అవుతాడు. అక్కడ నుంచి  అసలు తమకు గతాన్ని తవ్వటం మొదలెడతాడు. క్రిందటి జన్మలో తాము ప్రేమికులం అని అర్దం చేసుకుంటాడు. ఈ జన్మలో అయినా తాము ఒకటవ్వాలని అనుకుంటాడు.

ఈ లోగా అఫ్రీన్ తో పెళ్లి  నిశ్చయమైన పాకిస్దాన్ కుర్రాడు నాదిర్‌ (విషు రెడ్డి)కు ఆమె ఇండియాలో ఉండటం నచ్చదు. అందుకే కుటుంబంలో గొడవ చేసి తనను తిరిగి పాకిస్తాన్‌కు పిలిపిస్తాడు. ఇప్పుడు ఇండియాలో ఉన్న రోషన్ ..పాకిస్దాన్ వెళ్లి తన ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నాడు. ఆమెను, అక్కడి వారిని ఎలా ఒప్పించాడు,గత జన్మలో వీరి ప్రేమ కథ ప్లాష్ బ్యాక్ ఏమటి వంటి  అనేక  విషయాలు తెలిసుకోవాలనే  ఆసక్తి ఉంటే ఖచ్చితంగా  సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

నాలుగు వందల ఏళ్ల నాటి కథ తీసుకొని,పునర్జన్మ, ప్రేమని కలిపి  రాజమౌళి ‘మగధీర’ సినిమా తీశాడు. ఆ సినిమా ఆ రోజుల్లో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ 1971 ఇండియా – పాకిస్థాన్‌ వార్‌ కథాంశానికి  2018 ని ముడివేసి .. రెండు స్టోరీలను మిక్స్‌ చేసి ‘మెహబూబా’ చిత్రాన్ని  తీశారు.  అయితే మగధీర చిత్రంలో   స్క్రీన్‌ప్లే…సినిమాకు హైలెట్ గా నిలిచి నిలబెట్టేసింది. ఇక్కడ అదే స్క్రీన్ ప్లే బోర్ కొట్టేసింది.

ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయితే మగధీర మళ్లీ తీసినట్లు ఉంటుంది అనుకున్నారో ఏమో…మొత్తం మార్పులు చేసారు. దాంతో ఇంటర్వెల్ కు కానీ కథ కాంప్లిక్స్ లోకి ప్రవేశించలేదు. అలాగే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో లవ్ స్టోరీ అద్బుతంగా ఉంటే సినిమా ఎక్కుతుంది. దురదృష్టవశాత్తు ఆ సీన్స్ కూడా  చాలా ఆర్టిఫిషియల్ గా బోరింగ్ గా సాగాయి. అయినా కొత్త కుర్రాడి మీద సింపుల్ లవ్ స్టోరీ తీసుకోకుండా ఎందుకు అంత బరువు పెట్టారో అర్దం కాదు.

పునర్జన్మ కథ…

పునర్జన్మ కథలకు ఓ ప్రత్యేకత ఉంది. జనరేషన్ మారిన ప్రతీసారి ఈ కథలు  పునర్జన్మ ఎత్తుతూనే ఉంటాయి. అందుకే మూగమనస్సులు నుంచి నిన్న మొన్న వచ్చిన మగధీర దాకా అన్ని పునర్జన్మ కథలే…సూపర్ హిట్ సినిమాలే. అయితే ఎంత పునర్జన్మ కాన్సెప్ట్ అయినా కథా,కథనంలో విషయం లేకపోతే  పుట్టిన వెంటనే  చచ్చిపోతాయి. అదే మొహబూబాకు జరిగింది.

స్క్రీన్ ప్లే…

ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే  గొప్పతనం ఏమిటంటే ఒక్క సారి అంటే ఒక్కసారి కూడా అరే..హీరో,హీరోయిన్స్ పాపం విడిపోయారు..మళ్లీ కలిస్తే బాగుండును అనిపించదు. అంతలా అన్ని జాగ్రత్తలతో పూరి దీన్ని డిజైన్ చేసారు.  ఎమోషన్స్‌ని, లవ్‌ని బ్యూటిఫుల్‌గా క్యారీ చేస్తేనే వర్కవుట్ అయ్యే సినిమా ఇధి. అటువంటిదేమి కనపడదు. ముఖ్యంగా ఇలాంటి కథలకు క్లైమాక్స్‌ని హోల్డ్‌ చేసిన విధానం సినిమాని హిట్ చేస్తుంది. ఆ విషయంలోనూ ఫెయిల్ అయ్యింది.

పాకిస్దాన్, ఇండియా బ్యాక్ డ్రాప్ లో పదేళ్ల క్రితం హిందీలో వచ్చే లౌడ్ సినిమాలను గుర్తు చేసింది. పాకిస్దాన్ ని కసితీరా కసురుకోవటం, మన దేశాన్ని ఎత్తటం ఇదే సినిమాని నిలబెట్టేస్తుందని పూరి వంటి దర్శకుడు భావించటం విషాదం.  చాలా పెద్ద సినిమాని చూసిన ఫీల్ తీసుకువచ్చింది స్లో నేరేషన్.

మెయిన్ మైనస్…

విలన్ పాత్ర ఎంతసేపు ఒక చోట నిలబడి డైలాగులు చెప్తూనే ఉంటాడు తప్ప..ఎక్కడా యాక్షన్ లోకి దిగి వారి ప్రేమ కథకు అడ్డంకులు సృష్టించడు. అదీ అతను తప్పు కూడా కాదు.  పాపం ఆ విలన్ కు ..అసలు తను పెళ్లి చేసుకుందామనుకున్న అమ్మాయికి లవ్ స్టోరి ఉందనే విషయం సినిమా ప్రీ క్లైమాక్స్ వచ్చేవరకూ తెలియదు. ఇంకేమి చేయగలడు..చేస్తాడు. కేవలం అనుమానించి ఫోన్ లో డైలాగులు చెప్పటం తప్ప. బలమైన విలనిజం ఉంటే సినిమా వేరే విధంగా ఉండేది.

‘సొంతం’ సాంతం వదిలేసాడు…

ఇక పూరి జగన్నాథ్ బలం హీరో డిఫరెంట్ క్యారక్టరైజేషన్, చక్కటి కామెడీ, పంచ్ డైలాగులు,అదిరిపోయే ఐటం సాంగ్ ,చిన్నపాటి ఎమోషన్ ..ఇవన్నీ మొత్తం వదిలేసి ఈ సినిమా చేసారు. అంత మాత్రాన ఈ సినిమాకు కలిసి వచ్చిందీ ఏమీ లేదు. చక్కటి పాటలు తీసుకోలేదు.దాంతో ఆ కుర్రాడుకి సరైన స్టెప్స్ వేసే అవకాసం లేకుండా పోయింది.

టెక్నీషియన్స్‌ అందరూ చాలా హార్డ్‌వర్క్‌ చేసినా కథ,కథనంలో సరైన బలం లేకపోవటంతో వారి ప్రతిభ ఏదీ ఎలివేట్ కాలేదు. ఆర్టిస్ట్ లలో విలన్ పాత్ర ఎందుకలా విపరీతంగా ప్రవర్తిస్తూంటాడో అర్దంకాదు. మిగతావాళ్లు కొంచెం అటూ ఇటూ లో అలాగే ఉన్నాయి. డైలాగులు కొన్ని బాగా పేలాయి.

ఆశాశ్ ఎలా చేసాడంటే…

అద్బుతంగా చేసాడని అనలేం కానీ కొత్తగా పరిచయమవుతున్న చాలా మంది కుర్రాళ్ల కన్నా మంచి ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి కథ పడితే నిలబడిపోతాడు. అయితే అతని వయస్సు తగ్గ కథలు ఉండాలి. జయం,నువ్వు-నేను లాంటి ప్రేమ కథలు పడాలి.

ఫైనల్ థాట్…

వయస్సు ‘పూరి కనెక్ట్స్’ జనాలకు కనెక్ట్ అవ్వాలంటే పూరి కొత్త తరహా కథలకు కనెక్ట్ అవ్వాలి.

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి లావ‌ణ్య
నటీనటులు: ఆకాశ్ పూరి, నేహాశెట్టి, విష్ణురెడ్డి, ముర‌ళీశ‌ర్మ‌, అశ్విని, జ్యోతి రానా, టార్జాన్‌, షాయాజీ షిండే, రూప‌, అజ‌య్‌, పృథ్వీ త‌దిత‌రులు
సంగీతం: స‌ందీప్ చౌతా
క‌ళ‌: జానీ షేక్‌
ఛాయాగ్రహణం: విష్ణుశ‌ర్మ
కూర్పు: జునైద్ సిద్ధిఖీ
నిర్మాణం: పూరి క‌నెక్ట్స్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌

– సూర్య ప్రకాష్ జోశ్యుల

- Advertisement -