పంబరేగ్గొట్టావు కదా నాయనా..: ‘జంబలకిడి పంబ’ మూవీ రివ్యూ

jamba-lakidi-pamba
- Advertisement -

jamba-lakidi-pamba

మగాడి కష్టాలు.. ఆడవాళ్లకేం తెలుస్తాయండి?
అవును మరి.. ఆడవాళ్ల కష్టాలు మాత్రం మహా తెలుసు.. మగాళ్లకు!
ఇది  రోజువారీ జీవితంలో అప్పుడప్పుడూ  మొగొడూ పెళ్లాలు మధ్య వచ్చే మాటలే… దెప్పి పొడుపులే.
నిజంగానే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఒకరి సుఖ, సంతోషాలు మరొకరికి ఎంత చెప్పుకున్నా అర్థంకావు.. అవి అనుభవించి తీరాల్సిందే. అలా అనుభవించాలంటే… పూర్వం రోజుల్లో అయితే పరకాయ ప్రవేశం అనే కాన్సెప్ట్ ఉండేదట. అయితే ప్రతీ దానికి లాజిక్‌లు అడిగే  ఈ కాలంలో కూడా అలాంటి మ్యాజిక్కులు జరిగేందుకు అవకాశం లేదు. కానీ…

ఈ సినిమాలో జరిగింది…

ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్, పల్లవి(శ్రీనివాస్‌, సిద్ధి ఇద్నానీ) లకు క్షణం పడదు. ఆమెకు అతనిపై అనుమానం. అతనికి ఆమె ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి అల్లరి చేసే టైప్ అని చిరాకు. చిలికి చిలికి గాలి వాన అయ్యినట్లు వీళ్లద్దరూ విడాకులు తీసుకుందామని డెసిషన్ కు వచ్చేస్తారు. అప్పటికే 99 మందికి విడాకులు ఇప్పించిన ప్రముఖ లాయర్  హరిశ్చంద్ర ప్రసాద్‌(పోసాని కృష్ణమురళి)ని సంప్రదిస్తారు. ఆయన ఆ పనిలో ఉండగా…యాక్సిడెంట్ అయ్యి..సతీసమేతంగా పై లోకానికి చేరుకుంటాడు.

కానీ అక్కడ దేవుడు…అతన్ని భార్య దగ్గరకు పోనివ్వడు. దూరం పెడతాడు. అదేంటి అంటే…ఓ కండీషన్ పెడతాడు. ‘నువ్వు డైవర్స్ ఇప్పిద్దామనుకున్న వందో జంటను కలిపితేనే నీ భార్య వద్దకు నిన్ను పంపుతాను’ . అప్పుడు పోసాని.. ఆత్మ రూపంలో క్రిందకు వచ్చి.. వీళ్లద్దరిని కలపటానికి  జంబ లకిడి పంబ మంత్రం వేస్తాడు. దాంతో  వరుణ్‌ శరీరంలోకి పల్లవి ఆత్మ, పల్లవి శరీరంలోకి వరుణ్‌ ఆత్మ వెళ్తుంది. రూపాలు మారిన ఆ జంట ఏం చేసారు. పోసాని …వీళ్లద్దరిని కలిపి తన భార్య దగ్గరకు వెళ్లాడా వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

హీరో పోసాని… శ్రీనివాస రెడ్డి కాదు…

కథ తయారు చేసిన రచయిత కమ్ డైరక్టర్ ఓ విషయం మర్చిపోయినట్లున్నారు. ఇది శ్రీనివాస రెడ్డి చుట్టూ తిరిగే కథ కాదు.. పోసాని చుట్టూ తిరిగే కథ. పోసానికే సమస్య వచ్చింది.  దాన్ని పరిష్కరించుకోవటానికి పోసాని కృషి చేస్తాడు.. చివరకు విజయం సాధిస్తాడు. అంటే పోసాని చుట్టూ తిరిగే , ఆయన ప్రధాన పాత్రగా తీసిన సినిమా ఇది. శ్రీనివాస రెడ్డి ఈ విషయం కావాలని మర్చిపోయాడో లేక కామెడీగా కొట్టుకుపోతుందనుకున్నాడో కానీ.. శ్రీనివాస రెడ్డి హీరో అనుకుని వెళ్లిన వాళ్లకు పోసాని పిచ్చి కథ.. పిచ్చ మెంటలెక్కిస్తుంది.

టైటిల్ పాడు చేశారే…

నిజానికి ఈ సినిమాకు ఈ మాత్రం అయినా క్రేజ్ వచ్చిందంటే దానికికారణం ..ఇవివి గారి సూపర్ హిట్ టైటిల్. ఆ టైటిల్ ఇలాంటి  కథతో తయారైన సినిమాకు పెట్టడం…దారుణం. బహిరంగ క్షమాపణ డిమాండ్ చేయచ్చు..ఇవివి గారి అభిమానులు అంతలా ఉందీ సినిమా.

టెక్నీషియన్స్ ఎలా చేశారంటే..

 “A mediocre director can sometimes make a passable film out of a good script, even an excellent director can never make a good film out of a bad script.” : Akira Kurosawa

కేవలం డైరక్టర్ మాత్రమే కాదు.. టెక్నీషియన్స్ అందరిదీ అదే పరిస్దితి. బాగోని స్క్రిప్టుతో ఎవరూ బాగుంది అనిపించుకునే సినిమా కూడా చేయలేరు.

రొటీన్‌గా చెప్పుకునే మాటలు…

శ్రీనివాస రెడ్డి ఎప్పటిలాగే బాగా చేసాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఎన్నైనా చెప్పండి…

ఎవరు ఎన్నైనా చెప్పచ్చు కానీ..కామెడీ లేకుండా కామెడీ సినిమా చేయటం… చాలా చాలా కష్టం. అందులో ఈ టీమ్ కు డిస్టెంక్షన్ వచ్చింది.

ఫైనల్ థాట్..

పోసాని చనిపోయి పైకి వెళ్లాక..  దేవుడు..నువ్వు చేసిన పాపాలకు… నిన్ను నీ  భార్య దగ్గరకు పంపను  అని అంటే అదో సూపర్ ఆఫర్ లా  హ్యాపీ ఫీలవకుండా..నేను నా భార్య దగ్గరకు వెళ్తాను…అంటూ సృష్టి విరుద్దంగా మాట్లాడటమేంటో అర్దం కాలేదు. అలాంటి అవకాసం వచ్చినప్పుడు బ్రేక్ డాన్స్ చేయాలి కానీ.. 🙂 ఇలాంటి సృష్టి విరుద్దమైన ఆలోచనలతో ఈ సినిమా ఏం సాధిద్దామని…  ☺☺

తారాగ‌ణం: శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.

సంగీతం: గోపీసుంద‌ర్
ఛాయాగ్ర‌హ‌ణం: స‌తీశ్ ముత్యాల‌
క‌ళ‌: రాజీవ్ నాయ‌ర్‌
నిర్మాణం: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)
సంస్థ‌: శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్
విడుద‌ల‌: 22 జూన్ 2019

శ్రీనివాస రెడ్డి  చేతిలో ఉన్న బోన్సాయ్  చెట్టు  మనమే..
( సినిమా ఓపిగ్గా చూసి వచ్చాక  మనం ఎలా ఉన్నామో అని చెక్ చేస్తున్నారు)

srinivas-reddy

– సూర్యప్రకాష్ జోశ్యుల

 

- Advertisement -