దేశ రక్షణకు ఆపద వాటిల్లినప్పుడు గూఢచారి 116 రంగంలోకి దిగటం మనకు అనాదిగా వస్తున్న తెలుగు సినీ ఆచారం. ప్రాణాలను సైతం పణంగా పెడుతూ… ఊరు, పేరు తెలియని ద్రోహుల ఆటకటిస్తూండటం అతని డ్యూటీ. కృష్ణగారు అప్పట్లో ఆ పాత్రల్లో బాగా రాణించారు. ఏజెంట్ గోపి, గూఢచారి 116, జేమ్స్ బాండ్ 777, రహస్య గూఢచారి వంటి బోలెడు రకాలుగా మారు వేషాలు వేసి.. విలన్స్ తాట తీశారు. ఆ తర్వాత తరంలో చిరంజీవి త్రినేత్రుడు , గూఢచారి నెంబర్ 1 వంటి సినిమాలు చేశారు. కానీ ఈ తరంలో గూఢచారి సినిమాని చేసే డైరక్టర్, హీరో కనపడటం లేదు. అలాంటి ఈ టైమ్‌లో… నేనున్నా అంటూ అడవి శేషు… రంగంలోకి దూకాడు. మరి ఈ తరం గూఢచారి ఏ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించాడు? పాత గూఢచారి సినిమాల తరహాలోనే ఈ సినిమా సైతం సాగిందా? సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో చూద్దాం.
ఈ కొత్త ఏజెంట్ గోపీ కథేంటంటే…
గోపి (అడివి శేష్) తండ్రి రఘువీర్… సీక్రెట్ ఏజెంట్‌గా త్రినేత్ర అనే ఆపరేషన్‌లో పాల్గొని టెర్రరిస్టుల చేతుల్లో మరణిస్తాడు. దాంతో గోపీని అతని మామయ్య సత్య(ప్రకాష్ రాజ్) పెంచుతూంటాడు. ఎందుకైనా మంచిదని అర్జున్ అని పేరు మార్చి, తనే తండ్రిగా రికార్డ్‌లు సైతం క్రియేట్ చేస్తాడు. కానీ గోపికు మాత్రం ఎప్పుడూ తన తండ్రే గుర్తుకు వస్తూంటాడు. తన తండ్రిలాగే తను సీక్రెట్ ఏజెంట్ అవ్వాలని, దేశాన్ని రక్షించేయాలని జీవితాశయం పెట్టుకుంటాడు. ఆ ఉద్యోగం కోసం అప్లై చేయగా.. చేయగా చివరకు అతన్ని సెలెక్ట్ చేస్తారు. తన తండ్రి పనిచేసిన త్రినేత్ర టీమ్‌లోనే సీక్రెట్ ఏజెంట్‌గా జాబ్‌లో జాయిన్ అయ్యి… ట్రైనింగ్ తీసుకుంటాడు. అయితే కొన్ని అనుకోని పరిణామాల వల్ల అతను ఓ టెర్రిరిస్ట్‌గా ఇరికించబడతాడు. దాంతో తన టీమే తనను వెంటాడటం మొదలెడుతుంది. మరోపక్క అసలు తనను ఎవరు ఇరికించారో తెలుసుకుని ఆ చిక్కు ముడిని విప్పటానికి ఏజెంట్ గోపీ రంగంలోకి దూకుతాడు. ఇంకా జాబ్‌లోకి కూడా సరిగ్గా జాయిన్ అవ్వకుండానే .. అర్జున్‌ని… టెర్రిరిస్ట్‌గా ఎందుకు ఇరికించారు? వాళ్లకు ఏం లాభం? గోపి వాళ్ల కుట్రను ఎలా ఛేదించాడు? ఈ సినిమాలో హీరోయిన్ శోభిత దూళిపాళది ఏం పాత్ర? ఇలాంటివన్నీవెండి తెరపై చూడాల్సిన మిగతా విషయాలు.
బడ్జెట్ పెంచి, ఎమోషన్ సీన్స్ తగ్గిస్తే…
కొత్త కథలు ఎప్పుడు ఆసక్తికరంగా చెప్పినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ విషయం అడవి శేషుకు ఒక్క క్షణం సినిమాతో ప్రూవ్ అయ్యింది. దాంతో అదే ఉత్సాహంతో రకరకాల మలుపులతో ఈ సినిమాని చాలా ఇంట్రస్టింగ్ గా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ఈ సినిమా ఫస్టాఫ్ అయితే విల్లు నుంచి వదిలిన బాణం అంత స్పీడుగా దూసుకుపోయింది. సెకండాఫ్ .. కాస్తంత ఎమోషనల్ సీన్స్ దట్టించటంతో కొద్దిగా థ్రిల్ మిస్సైంది. కానీ ఓవరాల్‌గా మంచి థ్రిల్లర్ చూసిన ఫీల్ అయితే వచ్చింది.
అలాగే గూఢచారిగా సెలక్ట్ అవటం, ట్రైనింగ్ వంటివి ఏ సినిమాల్లోనూ సాధారణంగా చూపించటం జరగదు. ఆ విషయాలన్ని చూపించుకుంటూ కథలోకి వెళ్లటం మరో ఇంట్రస్టింగ్ ఏస్పెక్ట్. అలా చేయకుండా డైరక్ట్ గా సమస్య వచ్చింది..ఓ గూఢచారి రంగంలోకి దూకాడు అంటే కష్టం అనిపించేది. ఎందుకంటే అడవి శేషు ఇమేజ్…ఇంకా డైరక్ట్ గా జేమ్స్ బాండ్ స్దాయి కు చేరలేదు కదా. అలాగే ఈ సినిమాకు ఇంకా ఎన్నైనా సీక్వెల్స్ తీసుకోవచ్చు అనే క్లూ ని సైతం ఇచ్చారు.
కొత్త డైరక్టర్ ఎలా…
నిజానికి ఈ సినిమా ని డైరక్టర్ చేసింది కొత్త డైరక్టర్ అంటే ఎవరూ నమ్మరు..అంత బాగా చేసారు. ఎక్కడా ఒక్క షాట్ గా ఎగస్ట్రా అనిపించకుండా,బోర్ కొట్టకుండా లాగారు. అయితే సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ని స్క్రిప్టు దశలోనే తగ్గించేసి ఉంటే గూఢచారి..ఇంటర్నేషనల్ స్దాయిలో ఉండేది. అయినా అతనికిచ్చిన బడ్జెట్ లో అద్బుతమే చేసాడని చెప్పాలి.
సాంకేతికంగా ఎలా ఉందంటే…
ఇలాంటి సినిమాలకు టెక్నికల్ టీమే ప్రధానం. అందుకు తగిన టీమే ఈ సినిమాకు దొరికింది. శనీల్ డియో సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణమై నిలిచింది. ఎడిటింగ్ కూడా కథను పరుగెత్తించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫెరఫెక్ట్ గా మాచ్ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఎవరెలా చేశారు…
ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే రైటర్,హీరోగా చేసిన అడవి శేషు…సీక్రెట్ ఏజెంట్ గానూ స్టైలిష్ గా బాగున్నారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గా శోభిత ధూళిపాళ ..జస్ట్ ఓకే అన్నట్లు చేసింది. సుప్రియ కు ఇచ్చిన ఫుల్ లెంగ్త్ రోల్ కు న్యాయం చేసింది. వెన్నెల కిషోర్ పాత్ర ..పెద్దగా నవ్వించలేదు కానీ కథకు ఉపయోగపడేదే.
ఫైనల్ థాట్…
జేమ్స్ బాండ్ సినిమానే కానీ అంత బడ్జెట్ లేదు… ఆ స్థాయి బడ్జెట్‌తో భాఘీ 3 అని హిందీలో తీస్తారేమో…
రేటింగ్ : 3
ఎవరెవరు…
నటీనటులు: అడివి శేష్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్, వెన్నెల కిషోర్, మధు శాలిని, రవి ప్రకాష్, సుప్రియ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: షానియల్ డియో
ఎడిటింగ్: గ్యారీ
కథ, రచన: అబ్బూరి రవి, అడివి శేష్
నిర్మాత: అభిషేక్ పిక్చర్స్
దర్శకత్వం: శశి కిరణ్ టిక్కా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
విడుదల తేది: 03-08-2018