కొత్త దర్శకులు హవా మొదలైంది. టాలీవుడ్ కొత్త నీరుని ఆహ్వానిస్తోంది. కొత్త కాన్సెప్టులతో కళకళలాడుతోంది. స్టార్ బలం కన్నా కథా బలం గొప్ప అనిపించుకునే సందర్బాలను టాలీవుడ్ చూస్తోంది. ఈ ఊపులో రచయితగా ‘మీ శ్రేయోభిలాషి’ వంటి చిత్రంతో పరిచయమైన రమేష్ చెప్పాల… దర్శకుడుగా మారారు.
రచయితే దర్శకుడు అయినప్పుడు ఉండే రచనా సౌలభ్యాన్ని విరివిగా ఉపయోగించారు. డైలాగులతో సీన్స్ పండించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టి ప్రేక్షకుడుకి పంచ్ ఇచ్చారు. అయితే అవి మాత్రమే సినిమాని నిలబెడతాయా?…అసలు చిత్రం కథేంటి?…‘అరవింద సమేత’ వంటి పెద్ద చిత్రం హోరులో ఈ ‘బేవర్స్’ సినిమా శబ్దం వినపడుతుందా? తదితర విషయాలు రివ్యూలో చూద్దాం.
ఇదో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కథ…
కష్టపడి ఒక్కో మెట్టూ ఎదుగుతూ..ప్లెక్సీ బిజినెస్‌లో తనకంటూ ఓ స్దానం ఏర్పాటు చేసుకుంటాడు సత్యమూర్తి (రాజేంద్ర ప్రసాద్). ఆయనకో కూతురు, కొడుకు. భార్య చనిపోయాక పిల్లల మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నఆయనకు ఒకటే బెంగ. అది ఆయన కుమారుడు (సంజోష్) . బీటెక్ పాసైనా… ఉద్యోగం లేక.. కుటుంబ బరువు, బాధ్యతలు పట్టించుకోక.. బేవర్స్ గా తిరుగుతున్న కొడుకును ఎలా కంట్రోల్లో పెట్టాలో ఆ తండ్రికి అర్దం కాదు.
తండ్రి తన వైపు నుంచి ఆలోచించటం లేదని, కొడుకు తనని అర్దం చేసుకోవటం లేదని..ఇలా ఎవరి వెర్షన్ లో వాళ్లు ఉంటూ కమ్యూనికేషన్ గ్యాప్ పెంచుకుంటారు. అయితే కూతురు సిరి కు మాత్రం తన అన్నయ్య అంటే ఇష్టం. ప్రతీ విషయంలోనూ తండ్రికి అడ్డం పడి అన్నకు సపోర్ట్ ఇస్తుంది. ఈ లోగా ఆమెని ఇష్ట పడ్డానంటూ ఓ కుర్రాడు రావటం అతనితో పెళ్లి కుదరటం జరుగుతుంది.
అయితే ఊహించని విధంగా ఆమె పెళ్ళి మరికొద్ది రోజులు ఉందనగా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది ఎవరికీ అర్దం కాదు. ఆమె కూడా లేకపోవటంతో ఆ తండ్రి, కొడుకులు ఇద్దరూ ఎడమొహం, పెడ మొహం గా మారిపోతారు. ఈలోగా సిరి..సూసైడ్ చేసుకోలేదు. హత్యకు గురైంది అనే విషయం అన్న సంజోష్ కు తెలుస్తుంది.
అక్కడ నుంచి ఎవరు తన చెల్లిని చంపేసారు. అసలు తన చెల్లిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది..వాళ్లను పట్టుకున్నాడా అనే యాంగిల్ లో కథ జరుగుతూ ఓ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి…, ఇందులో హీరోయన్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే…
ఈ సినిమాలో చెప్పబడ్డ అంశం కొత్తది కాదు కానీ నిత్య నూతనమైనదే. మీ పిల్లల కలలు..మీ కలలు సింక్ అయితేనే కుటుంబ జీవనం సరిగ్గా ఉంటుంది అని పేరెంట్స్ రాసిన ఓ ఉత్తరంలా ఉంది. అలాగని మరీ మెసేజ్ ఓరియెంటెడ్ కాదు కానీ ..ఉన్నంతలో ఓ మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసారు.
కొన్ని సినిమాలు సాదా సీదా గా మొదలవుతాయి…సందర్బం చూసుకుని సమస్యను విస్తరించుకుని…సంరంభంగా ముగుస్తాయి. అలాంటిదే ఈ బేవార్స్ సినిమా. ఓ సాదా సీదా కుటుంబ కథలా..తండ్రి,కొడుకు, కూతురు మధ్య జరిగే సన్నివేశాలతో మొదలయ్యి…ఓ క్రైమ్ థ్రిల్లర్ గా ఊహించని మలుపుతో ముగిసింది.
అయితే ఆ చివర ఏదో తెలియనప్పుడు ఈ చివర పట్టుకుని అక్కడిదాకా ఓపిగ్గా ప్రయాణం చేయించేందుకు తగ్గ ఊతం ఇవ్వగలగాలి. అయితే బేసిగ్గా కథకుడు అయిన ఈ దర్శకుడు..ఆ విషయం ప్రక్కన పెట్టి తనకు తోచిన దారిలో సినిమాని నడుపుకుంటూ వెళ్లిపోయారు. కొద్దిగా తెలిసున్న హీరో నటిస్తే….ఆ సమస్య ఉండదు. ఎదర ఏదో ఉందని ఎదురుచూస్తారు. కానీ కొత్త హీరో కావటంలో ఆ స్దాయిలో ఇంట్రస్ట్ పుట్టలేదు.
అలాగే …హీరో తను ఎంతగానో ఇష్టపడి చెల్లి మరణిస్తే ఆ వెంటనే …హీరోయన్ తో డ్యూయిట్..మందు పార్టీ వంటివి కనపడాయి. ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ కాదు. అది ఎడిటింగ్ చూసుకోవాల్సింది. అలాగే ఎక్కడో క్లైమాక్స్ ట్విస్ట్ కోసం కథని దాచి పెట్టారు.
మినిమం ఇంటర్వెల్ కి అయినా హీరోకు తన చెల్లి .. సూసైడ్ చేసుకోలేదు…హత్య చేయబడింది అనే విషయం తెలిస్తే… సెకండాఫ్ అయినా రక్తి కట్టేది. అలా కాకుండా ప్రీ క్లైమాక్స్ లో ఆ విషయం రివీల్ చేసి, క్లైమాక్స్ లో ఆ చంపింది ఎవరనేది తేల్చాశారు. దాంతో సెకండాఫ్ కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఫస్టాఫ్ కథ లేకుండా అయ్యిపోయింది. కొద్ది గా స్క్రీన్ ప్లే మార్పుతో చాలా మారిపోయేది.
కొత్త దర్శకుడైనా…
నిజానికి కొత్త దర్శకుడుకి ..సీనియర్ హీరో, టెక్నీషియన్స్ దొరికితే ఏ ఇబ్బంది , తడబాటు ఉండదు. కానీ దర్శకుడూ కొత్తే, హీరో కొత్తే,నిర్మాతా కొత్తే అన్నప్పుడు సమస్యే. అయితే దర్శకుడు రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ ఆర్టిస్ట్ ని ఎంతో భాగోద్వేగంగా కొన్ని సన్నివేశాల్లో జీవించేలా చేసారు. హీరో చేత కొన్ని సీన్స్ లో నటన రాబట్టారు. కొన్ని చోట్ల చేతులు ఎత్తేశారు.
అలాగే కొత్త హీరో కదా అని వరస ఫైట్స్, డ్యూయిట్స్ పెట్టేసినట్లున్నారు. క్రైమ్ థ్రిల్లర్ ని అలాగే ..సింపుల్ గా నడిపితే రాణించేది. అయినా దర్శకుడు చక్కటి డైలాగులు రాసుకోలగలరు, మంచి కథ ఉంటే డైరక్షన్ అలవోకగా చేసుకోగలరు అని ప్రూవ్ చేసుకోవటానికి ఈ సినిమా ఉపయోగపడింది.
రాంగ్ ప్రమోషన్..
ఇక ఈ సినిమా ప్రోమోలు, పత్రికా ప్రకటనలు అన్నిటిలో ఇదేదో పూర్తి స్దాయి ఫ్యామిలీ సినిమా అన్నట్లు ప్రొజెక్టు చేసారు. అలాకాకుండా ఫ్యామిలీ థ్రిల్లర్ అని ఫోకస్ చేసి ఉంటే …ఆ తరహా సినిమాలు ఇష్టపడే వారు వెళ్లేవారు. థియోటర్ కు వెళ్లి చూసేదాకా ఆ విషయం సీక్రెట్ గా పెట్టినట్లు అయ్యింది. దాంతో ఫ్యామిలీ సినిమా చూద్దామని వచ్చేవారికి పూర్తి తృప్తిగా అనిపించదు.
టెక్నికల్ గా..
చిన్న సినిమాలు స్దాయికు తగ్గట్లుగా టెక్నికల్ విలువలు ఉన్నాయి. అద్బుతమూ కాదు..తీసి పారేసేలాగ లేదు. పాటలు జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.
ఫైనల్ ధాట్…
రాజేంద్రప్రసాద్ ని హైలైట్ చేయటం, పోస్టర్స్, ట్రైలర్స్ లో ఎక్కువగా ఆయనే కనపడటంతో ఈ చిత్రం హీరో ఆయనే అనుకుని.. ఏం చూస్తాంలే టీవిలో చూద్దాం.. అనుకునే ప్రమాదం లేకపోలేదు. అలాగే బేవర్స్ అనేది ఇడియట్ అంత ఓల్డ్ టైటిల్ ..సినిమా అప్పుడు తీసి ఇప్పుడు రిలీజ్ చేసారనే ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రమోషన్ లో ఇది కొత్త సినిమా..కొత్త తరానికే ఉద్దేశించిందని చెప్పగలగాలి. అప్పుడే ఇలాంటి సినిమాలు నిలబడతాయి.
నటీనటులు : రాజేంద్రప్రసాద్, సంజోష్, హర్షిత తదితరులు.
నిర్మాతలు : పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అరవింద్
సంగీతం : సునీల్ కశ్యప్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రమేష్ చెప్పాల