కేంద్రంలో బీజేపీ వ్యూహమేంటి? కేసీఆర్, జగన్‌లను ఆహ్వానిస్తుందా?

- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందనే విషయంలో దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమివైపే మొగ్గుచూపాయి. 2019 ఎన్నికల మహాసంగ్రామంలో బీజేపీయే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని, ఈ నేపథ్యంలో ఎన్డీయేనే తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని రాజకీయ పండితుల విశ్లేషణ కూడా.

అయితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 273. ఇక బీజేపీ అయితే చాలా ధీమాగా ఉంది. ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే తమ పార్టీ 74కుపైగా సీట్లను కైవసం చేసుకుంటుందని, తాము ఒంటరిగానే 300కుపైగా సీట్లు గెలుస్తామని ఆ పార్టీ చెబుతూ వచ్చింది.

అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. దేశంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలు బీజేపీకే వస్తాయని చెబుతున్నప్పటికీ.. విపక్షాల బలం కూడా ఈసారి పెరుగుతుందని, కాబట్టి బీజేపీ చెబుతున్న సీట్లు తెచ్చుకోలేకపోవచ్చని వివరిస్తున్నాయి.

2014 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు ఈసారి బీజేపీ దక్కించుకోలేకపోవచ్చు అని చెప్పడానికి కారణం ఏమిటంటే.. చాలామంది మిత్రులు ఆ పార్టీకి దూరం కావడమే.

అయితే నరేంద్ర మోడీ కి ఈసారి అధికారం దక్కదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెబుతున్నా.. అది నిజం కాకపోవచ్చు. అయితే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి మోడీకి అడ్డంకులు సృష్టించే ప్రమాదం లేకపోలేదు.

కాంగ్రెస్ విషయానికొస్తే…

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలందరికీ తెలిసిన కాంగ్రెస్ పార్టీకి 2014లో వచ్చిన సీట్లు కేవలం 44 మాత్రమే. ఈసారైనా ఆ పార్టీ సొంతగా కనీసం 100 సీట్లు అయినా గెలుస్తుందా? అంటే.. అదీ కష్టమే! ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతగా 100 సీట్లు గెలుచుకుంటుందని చెప్పలేదు.

మహా వస్తే.. ఆ పార్టీకి 80 స్థానాల వరకు రావచ్చు. ఇక రాహుల్ గాంధీ నాయకత్వం విషయానికొస్తే.. యూపీఏలోని ఏ వర్గమూ రాహుల్ నాయకత్వం బాగలేదనే అభిప్రాయం వ్యక్తం చేయకపోయినా.. ఆయన కంటే ప్రియాంక గాంధీకే ప్రజల్లో మరింత ఆకర్షణ ఉంటుందని అంటున్నాయి.

ప్రియాంక దిగినా…

మరి ఇదే వాస్తవమైతే.. ఎలాగైనా కాంగ్రెస్‌కు తిరిగి మునుపటి జవసత్వాలు తీసుకురావాలన్న లక్ష్యంతో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా క్రియాశీల రాజకీయాల్లోకి దిగారు. తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను ఆమె తీసుకున్నారు. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఏమీ కనిపించడం లేదు.

ఒక దశలో ప్రియాంకను వారణాసిలో ప్రధాని మోడీకి పోటీగా నిలపాలని కాంగ్రెస్ పెద్దలు భావించినా.. తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ చెప్పిన కనీస ఆదాయ పథకంపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు నమ్మకం కుదర్లేదు.

ఒంటరిగా బరిలోకి దిగి…

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఈసారి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. ఇది ఒకరకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే, ఇప్పటివరకు యూపీలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కాంగ్రెస్.. సమాజ్‌వాదీ లేదా బహుజన్ సమాజ్‌వాదీ.. ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీతో జతకట్టేది.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ యూపీ విషయానికొచ్చేసరికి మాత్రం పొత్తు పెట్టుకునేది. ఇది ఒకరకంగా ఆ పార్టీ క్యాడర్‌కు నిస్పృహ కలిగించే విషయమే. అందుకే ఈసారి కాంగ్రెస్ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగింది. ఈసారి ఇక్కడ ఏం జరుగుతుందనేది 23న తేలిపోతుంది.

ఇదీ బీజేపీ వ్యూహం…

ఇక బీజేపీ విషయానికొస్తే.. ఈసారి 300కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ఊదరగొడుతున్నప్పటికీ వాస్తవానికి అన్ని సీట్లు రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్పకనే చెబుతున్నాయి. దీంతో బీజేపీ కూడా తీవ్రంగా ఆలోచిస్తోంది.

ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని, అందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఎన్డీయే వైపు ఉండేలా చూసుకోవాలనేది నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆలోచన. ఈ నేపథ్యంలో యూపీఏ భాగస్వాములపై బీజేపీ కన్నుపడింది. ఏదో ఒకరకంగా ఆ పార్టీలను యూపీఏకు దూరం చేసి, తమతో కలుపుకునే వ్యూహాలను ప్రారంభించింది.

తలుపులే కాదు కిటికీలూ ఓపెన్…

ఇటీవల ప్రధాని మోడీతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. తమ పార్టీ విధానాలు నచ్చి ఎన్డీయేలో భాగస్వామ్యం అయ్యే పార్టీలను తాము స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.

దీన్ని మరో మాటలో చెప్పాలంటే.. ‘మేం తలుపులు తీసి పెట్టాం.. రావాలనుకున్న వారు రావచ్చు..’ అని అర్థం. ఇంకా బాగా తరచి చూస్తే.. బీజేపీ తలుపులు మాత్రమే కాదు.. కిటికీలు కూడా బార్లా తెరిచి పెట్టిందని తెలుస్తుంది.

పశ్చిమ బెంగాల్‌లో…

ప్రధాని మోడీకి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో బీజేపీ ఈ ఎన్నికల్లో పదుల సంఖ్యలో లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

అయితే ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై పెదవి విరిచిన ఫైర్‌బ్రాండ్ మమతా బెనర్జీ.. ఇదంతా మోడీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా కొట్టిపారేశారు. అయినప్పటికీ టీఎంసీ కార్యకర్తలకు ఏదో మూల కాస్తంత భయం. దీనికి కారణం.. ఆ రాష్ట్రంలో బీజేపీ శ్రమిస్తోన్న తీరే. అగ్నిలో ఆజ్యం పోసినట్లు.. 10 నుంచి 15 మంది టీఎంసీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ చెబుతుండడం కూడా.

ఒడిశా, తమిళనాడుల్లో…

గతంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై బీజేపీ అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు కురిపించేది. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా చేసింది. అయితే ‘ఫొనీ’ సమయంలో మాత్రం ఆ రాష్ట్రాన్ని సందర్శించిన ప్రధాని మోడీ.. నవీన్ పట్నాయక్‌పై ప్రశంసలు కురిపించారు.

దీంతో బీజేపీ నవీన్ పట్నాయక్‌తో చేతులుగాని కలుపుతుందా? అనే అనుమానం కూడా వచ్చింది. ఇక తమిళనాడు విషయానికొస్తే.. ఈ రాష్ట్రంలో యూపీఏ బలం బాగా పెరిగింది. ప్రస్తుతం ఎన్డీయేలో కొనసాగుతున్న అన్నాడీఎంకే పార్టీకి ఈసారి ఆరేడు సీట్లకు మించి రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. దీంతో మోడీ, షాలు ఈ రాష్ట్రం నుంచి ఎక్కవ సీట్లు ఆశించలేరు.

ఇక మిగిలింది ఏపీ, తెలంగాణ…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై బీజేపీకి ఎప్పట్నించో కన్నుంది. తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమే.

అందుకే ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా, నరేంద్ర మోడీ టీఆర్ఎస్‌ను పెద్దగా విమర్శించలేదు. పైపెచ్చు టీఆర్ఎస్‌కు మరింత మేలు కలిగేలా వాళ్లు కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. ఇక్కడ ఏన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయడంతో సహజంగానే టీడీపీనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఇక్కడ టీడీపీ ఓడిపోయి వైఎస్ జగన్‌ అధికారంలోకి రావాలన్నది బీజేపీ అంతర్గత ఆలోచన.

బీజేపీ వైఖరిని చూస్తోంటే.. ఇటు సీఎం కేసీఆర్‌తో, అటు వైఎస్ జగన్‌తో స్నేహంగా మెలగడమే మంచిదిలా అనిపిస్తోంది. ఎందుకంటే, రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు రాని పక్షంలో.. వీరితో స్నేహం మోడీ, షా‌లకు బాగా అవసరమవుతుంది. కాబట్టి 23న ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితులను బట్టి కేసీఆర్, జగన్‌కు బీజేపీ నుంచి పిలుపు అందవచ్చు!

చదవండి: జగన్‌కి శరద్ పవార్ ఫోన్…..బీజేపీయేతర పక్షంలోకి ఆహ్వానం..
- Advertisement -