బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం….కిషన్‌రెడ్డికి మాతృవియోగం

kishanreddy, ambharpet, hyderabad, bjp, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గంగాపురం కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అండాలమ్మ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు.

ఆమె ప్రస్తుత వయస్సు 80 సంవత్సరాలు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస్థితి ఒక్కసారిగా విషమించింది.

దీనితో వెంటనే ఆమెకి వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. అండాలమ్మ మృతితో కిషన్‌రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురులో ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే గత డిసెంబర్‌లో తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కిషన్‌రెడ్డి అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు.

గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు విజయం సాధించారు. ఆ తరువాత తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలిచారు. అండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

చదవండి: ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ : సీఎం…

- Advertisement -