వచ్చే నెల నుంచి ఎస్‌బీఐ ఖాతాదారులకు బాదుడే!

7:22 am, Sun, 8 September 19

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్‌ బ్యాంకు వినియోగదారులు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇకపై బ్యాంకు ఖాతాల్లో ఎడాపెడా డబ్బు జమ చేయడం కుదరదు. 

అక్టోబరు ఒకటో తేదీ నుంచి నగదు లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే నగదును ఉచితంగా జమచేసే అవకాశం ఉంటుంది.

ఆపై ప్రతీ లావాదేవీకి కొంత రుసుము చెల్లించుకోవాలి. మూడుసార్లు దాటితే ఆ తర్వాత చేసే ప్రతీ లావాదేవీకి రూ.50లు, దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. చెక్‌బౌన్స్ అయితే రూ.150లు ప్లస్ జీఎస్టీని కలిపి చెల్లించుకోవాలి.

 మెట్రో నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబైలలో మాత్రం ఇకపై ఉచితంగా 10 ఎస్‌బీఐ ఏటీఎం లావాదేవీలు లభిస్తాయి. ఇతర నగరాల్లో 12 లావాదేవీల వరకు నిర్వహించుకోవచ్చు.

ఇతర బ్యాంక్‌ ఏటీఎంలలో ఐదు లావాదేవీలను ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఎస్‌బీఐలో వేతన ఖాతాలుంటే ఏటీఎం సేవలు పూర్తిగా ఉచితం.

బ్యాంకుకు వెళ్లి చేసే ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్టీజీఎస్ సేవలకు రూ.20, రూ. 5 లక్షలు దాటితే రూ.40లు వసూలు చేస్తారు. దీనికి చార్జీలు అదనం.

అయితే, ఇవే సేవలను నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాకింగ్, లేదంటే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా మాత్రం పూర్తి ఉచితంగా చేసుకోవచ్చు.