విషాదం: మ్యాజిక్ అన్నాడు.. నదిలోకి దిగాడు.. బయటికి మాత్రం రాలేదు…

magician-chanchal-lahiri
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌‌లో ఓ మెజీషియన్ ఓ మ్యాజిక్ ట్రిక్‌ను ప్రదర్శిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి పేరు చంచల్ లహిరి(40). మ్యాజిక్ ట్రిక్‌లో భాగంగా తన కాళ్లూ చేతులకు గొలుసులు కట్టించుకుని తలకిందులుగా వేలాడుతూ హుగ్లీ నదిలోని నీటిలోకి దిగిన లహిరి ఎంతసేపు గడిచినా తిరిగి బయటికి రాలేదు.

దీంతో అక్కడ గుమికూడిన జనం పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు లహిరి కోసం గాలింపు మొదలుపెట్టారు. తరువాత కొంతసేపటికి ఈ ట్రిక్ ప్రదర్శించిన ప్రాంతానికి ఓ కిలోమీటరు దూరంలో అతడి మృతదేహం పైకి తేలింది. దీంతో అతడి అభిమానులు అవాక్కవగా, కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు.

అసలేం జరిగిందంటే…

అది కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి. పైగా ఆదివారం. ఓ చోట జనం గుమిగూడి ఉన్నారు. తీరా చూస్తే అక్కడ.. మెజీషియన్ చంచల్ లహిరి కనిపించారు. అంతేకాదు, కాసేపట్లో ఆయన ‘హుడీనీ ట్రిక్’ను చేయబోతున్నారనే వార్త ఆ చుట్టుపక్కల వ్యాపించింది. దీంతో వివిధ పనులపై ఆ ప్రాంతానికి వచ్చిన వారంతా మెల్లమెల్లగా అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు.

‘హుడీనీ ట్రిక్’ అంటే…

మెజీషియన్ చంచల్ లహిరికి ‘మాండ్రేక్’ అనే పేరు కూడా ఉంది. గతంలోనూ ఆయన ఇలాంటి మ్యాజిక్ చేశారు. హుడీనీ ట్రిక్‌లో భాగంగా చంచల్ లహిరి కాళ్లూ చేతులను గొలుసులతో బంధిస్తారు. తరువాత క్రేన్ సాయంతో తలకిందులుగా వేలాడదీయబడి.. అలా నీటిలోకి దిగిపోతారు.

ఆ తరువాత నీటి లోపలే తన చేతులు, కాళ్లకు ఉన్న బంధనాలను విప్పుకుని ఆయన తిరిగి పైకి రావాల్సి ఉంటుంది. దీనినే మెజీషియన్లు ‘హుడీనీ ట్రిక్’గా పిలుస్తారు. ప్రముఖ మెజీషియన్ హ్యారీ హుడీనీ దీనికి ఆద్యుడు.

చంచల్ లహిరి విషయంలో ఏం జరిగిందంటే…

ఆదివారం మెజీషియన్ చంచల్ లహిరి హుగ్లీ నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆయన ఓ పడవపై నుంచి ఈ హుడీనీ ట్రిక్‌ను చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేశారు. ఈ ట్రిక్‌ ప్రదర్శన కోసం లహిరి కోల్‌కతా పోలీసులు, కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ అనుమతి కూడా తీసుకున్నారు.

అతడి కుటుంబ సభ్యులు, మీడియా, పోలీసులు కూడా మరో పడవపై ఉన్నారు. ఆయన అభిమానులు కొందరు పక్కనే మరో రెండు పడవలపై నుంచి చూస్తుండగా, హౌరా బ్రిడ్జిపై నుంచి మరికొందరు, అలాగే హుగ్లీ నది ఒడ్డు నుంచి మరికొందరు వీక్షిస్తున్నారు.

చంచల్ లహిరి కాళ్లూ చేతులను గొలుసులతో బంధించారు. ఆ గొలుసులకు మొత్తం 6 తాళాలు వేసి ఉన్నాయి. క్రేన్ సాయంతో ఆయన్ని తలకిందులుగా నదిలోనీ నీటిలోనికి దించారు. చుట్టూ చేరిన వారిలో ఉత్కంఠ.

పది నిమిషాలు గడిచాయి. కానీ నీటిలో మునిగిన చంచల్ లహిరి మాత్రం పైకి రాలేదు. దీంతో ఈ ట్రిక్ చూస్తోన్న జనంలో ఆందోళన మొదలైంది. దీంతో పోలీసులు అప్రమత్తమై గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. అక్కడికి ఓ కిలోమీటరు దూరంలో మెజీషియన్ చంచల్ లహిరి మృతదేహం నీటిపైకి తేలి కనిపించి అందరినీ నివ్వెరపోయేలా చేసింది.

గతంలో చేసిన మ్యాజిక్కే…

నీటిలోపల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి మ్యాజిక్కును ప్రదర్శించడం మెజీషియన్ లహిరికి కొత్తేం కాదు. 20 ఏళ్ల క్రితం కూడా ఆయన ఇదే నదిలో ఈ ట్రిక్‌ను ప్రదర్శించారు.

అప్పుడు కాళ్లూ చేతులకు ఇనుప సంకెళ్లతోపాటు ఆయన్ని ఓ గాజు అద్దాల బాక్సులో ఉంచి మరీ నదిలోకి దించారు. అయితే అప్పుడు ఆయన ఈ ట్రిక్‌ను విజయవంతంగా ప్రదర్శించి, కేవలం 29 సెకన్లలోనే క్షేమంగా నీటిపైకి వచ్చారు.

ఇక 2013లో కూడా చంచల్ లహిరి ఇలాంటి ట్రిక్‌ను ప్రదర్శించారు. అయితే అప్పుడు అందరికీ ఆ మ్యాజిక్ కనిపించేలా చేశారాయన. కాళ్లూ చేతులు కట్టేసి ఓ పంజరంలో బంధించగా, అక్కడ్నించి తాను ఎలా బయటికి వస్తానన్నది చుట్టూ ఉన్నవారందరికీ కనిపించేలా చూపించారు.

బయటికొస్తే మ్యాజిక్.. లేదంటే ట్రాజిక్…

ఆదివారం ఈ హుడీనీ ట్రిక్ ప్రదర్శనకు ముందు మెజీషియన్ చంచల్ లహిరి మాట్లాడుతూ.. మ్యాజిక్ పట్ల ప్రజల్లో ఆసక్తిని తిరిగి పెంచేందుకు తాను ఈ ట్రిక్ చేస్తున్నానని, తనకు ఇది కొత్తేం కాదని చెప్పారు.

అయితే ఇప్పుడు వయసు మీదపడిందని, కాళ్లూ చేతులకు వేసిన సంకెళ్లను తాను తెంచుకుని క్షేమంగా బయటికి వస్తే మ్యాజిక్ అవుతుందని.. లేదంటే ట్రాజిక్ అవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఆయన అన్నట్లుగానే ఇది చివరికి ట్రాజిడీగానే ముగిసింది.

పోలీసులు ఏమంటున్నారంటే…

నదిలో ఓ పడవలో మ్యాజిక్ ప్రదర్శన అని మెజీషియన్ చంచల్ లహిరి తమకు తెలిపితే తాము అనుమతి ఇచ్చామని, అయితే ట్రిక్‌లో భాగంగా నీటిలోకి దిగవలసి ఉంటుందని ఆయనకు తమకు చెప్పలేదని కోల్‌కతా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన దురదృష్టకరం, దీనిపై విచారణ జరుపుతున్నాం అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

- Advertisement -