నేరస్తులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి, నాకివ్వరా?: ఈసీ సిబ్బందిపై కేఏ పాల్‌ ఆగ్రహం

ka-paul-waiting-at-election-commission
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు చుక్కెదురైంది. ఎన్నికల కమిషనర్లను కలవడానికి వచ్చిన ఆయనకు అపాయింట్‌మెంట్‌ నిరాకరించారు. సోమవారం ఉదయం ఆయన కార్యాలయానికి వచ్చినప్పుడు కమిషనర్లు లేరని, సాయంత్రం రావాలని ఈసీ కార్యాలయ రిసెప్షన్‌ సిబ్బంది కేఏ పాల్‌కు సూచించారు.

దీంతో సాయంత్రం 5 గంటలకు పాల్‌ మళ్లీ వచ్చారు. అయినా ఆయన్ని సిబ్బంది లోనికి అనుమతించలేదు. మంగళవారం ఉదయం రావాలని సూచించారు. ‘ఇక్కడ మీ ఫోన్‌ నంబరు రాసి వెళ్లండి. కమిషనర్లు అందుబాటులోకి వచ్చాక మీకు ఫోన్‌ చేస్తాం..’ అని తెలిపారు.

అయితే అదే సమయంలో వైసీపీ నేతలు రాగా, వారికి కమిషనర్లు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో కేఏ పాల్ ఫైర్ అయ్యారు.

వారికిస్తారు.. నాకివ్వరా?

నేరస్తులకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని, తనకు మాత్రం సమయం ఎందుకు ఇవ్వడం లేదో అర్థంకావడం లేదని ఈసీ కార్యాలయం వద్ద విలేకరులతో ఆయన వాపోయారు. కమిషనర్లకు స్వైన్‌ఫ్లూ వ్యాధి వచ్చిందని, అందుకే సమయం ఇవ్వడం లేదని సిబ్బంది చెబుతున్నారని, అయితే ముగ్గురు కమిషనర్లకు ఒకేసారి స్వైన్‌ఫ్లూ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.

అసలు ఎన్నికల సంఘం వైఖరి సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్‌, విశ్వహిందు పరిషత్‌, బజరంగ్‌దళ్‌‌లు దేశాన్ని నాశనం చేస్తున్నాయని పాల్ వ్యాఖ్యానించారు.

ఇదే విషయాన్ని తాను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఇప్పటికే చెప్పానని పేర్కొన్నారు.

- Advertisement -