అనిల్ అంబానీ ఆర్‌కామ్ సంచలన నిర్ణయం! భారీగా షేర్ల పతనం, ఇతర గ్రూపు కంపెనీలపైనా తీవ్ర ప్రభావం…

anil ambani
- Advertisement -

anil ambani

ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో మార్గం లేకపోవడంతో దివాలా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నట్లు రెగ్యులేటరీ సమాచారంలో తెలియజేసింది.

ఈ నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్లు భారీగా షేర్ల అమ్మకాలు జరపడంతో అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్(అడాగ్) కంపెనీ షేర్లు 50 శాతానికిపైగా పతనమయ్యాయి. సుమారు రూ.40 వేల కోట్ల మేర రుణ పరిష్కారాలకు సంబంధించిన అంశంలో 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్‌కామ్ ఈ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇతర  గ్రూపు కంపెనీలపై తీవ్ర ప్రభావం…

రెండున్నర సంవత్సరాలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అంతగా కలిసి రాకపోవడంతో రుణ పరిష్కారం ముందుకు సాగలేదని ఆర్‌కామ్ వెల్లడించింది. ఈ క్రమంలోనే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు తెలిపింది.

అనిల్ అంబానీ ఈ నిర్ణయంతో రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా అమ్మకాలతో ముఖ్యంగా ఆర్‌కామ్ 48 శాతం పతనమైంది. ఒక దశలో 54.3 శాతం పతనం కాగా, షేరు ధర 5.30 రూపాయల వద్ద రికార్డు కనిష్టానికి చేరింది.

ఇక అడాగ్ గ్రూపులోని రిలయన్స్ క్యాపిటల్ 12.5 శాతం, రిలయన్స్ పవర్ 13 శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోం ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్, రిలయన్స్ నావల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర సంబంధిత కంపెనీల షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.

- Advertisement -