ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ యూజర్లకి బ్యాడ్‌న్యూస్! ఇక మోతే…

10:32 am, Tue, 5 February 19
bad news for flipcart , amazon

bad news for flipcart , amazon

ముంబై: ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలావరకు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికే ఎక్కువ మంది ఉత్సహం చూపుతున్నారు. పోటీ ప్రపంచంలో సంపాదన కోసమే సమయం మొత్తం కేటాయిస్తుండడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కే ఓటేస్తున్నారు.

ఇదే అదనుగా దేశంలో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వివిధ సందర్భాలను పురస్కరించుకుని భారీఎత్తున డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, వడ్డీలేని నెలసరి వాయిదాల చెల్లింపులు వంటి సౌకర్యాలు కల్పించి అమ్మకాలను పెంచుకునేవి. అయితే ఇప్పుడు సీన్ మారింది.

డిస్కౌంట్‌ ఆఫర్లకి ఇక సెలవు..

ఆఫర్ల వలలో పడిపోయి అందరూ ఈ-కామర్స్‌ సైట్స్ పై మంచి ఆసక్తిని పెంచుకున్నారు. జనవరిలో కూడా ‘రిపబ్లిక్‌ డే సేల్‌’ పేరుతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు పోటాపోటీగా డిస్కౌంట్‌ ఆఫర్లు ఇచ్చాయి. చాలా తక్కువ ధరలకే వినియోగదారులకు వస్తువులను అందజేస్తూ వస్తున్నాయి. అయితే దీనివల్ల చిన్న చిన్న సంస్థలు, దుకాణాలు బాగా నష్టపోతున్నాయి.

ఇది గమనించిన ప్రభుత్వం ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిబంధనలు పూర్తిగా మార్చివేసింది.  ఇక నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఏ వస్తువును ప్రత్యేకంగా అమ్మడానికి వీలు లేదు. అందరితోపాటే అమ్మాలి.  అంటే.. కొన్ని రకాల వస్తువులు కేవలం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో మాత్రమే లభిస్తున్నాయి.  బయట ఎక్కడా ఆ వస్తువులును వినియోగదారులు కొనలేరు.

దీన్ని ప్రభుత్వం తాజాగా మార్చివేసింది. అంతేకాదు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు వాటా ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా ఇవి అమ్మడానికి వీలు పడదు. దీంతో జనవరి 31 నుంచే అమెజాన్‌లో చాలా వస్తువుల అమ్మకాలను నిలిపివేశారు.  ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ ఆఫర్లు, డిస్కౌంట్లు ఎరగా వేసి అమ్మకాల జోరును కొనసాగించిన ఈ కామర్స్ సంస్థలన్నీ ఇకమీదట అలా చేయలేవు.