బడ్జెట్ 2019: తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యే! ఎన్ని విన్నపాలు అటకెక్కాయంటే..?

union budget 2019
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ మధ్యతరగతి ప్రజలు, రైతులకు కొంత మేలు చేసేదిగా ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం మొండిచెయ్యే చూపింది. తెలుగు రాష్ట్రాలు కోరుతున్న ప్రాజెక్టులేమీ మంజూరు చేయలేదు. కొన్ని సంస్థలకు మొక్కుబడిగానే కేటాయింపులు జరిపారు.

తెలంగాణ విషయానికొస్తే బడ్జెట్ ఎలా ఉందంటే..?

రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాష్ట్రానికి అవసరమైన కీలక ప్రాజెక్టులు, సంస్థల గురించి వినతిపత్రాలు ఇస్తూనే ఉంది. తెలంగాణ సీఎంతోపాటు ఎంపీలు తరచూ ప్రధానిని, కేంద్రమంత్రులను కలుస్తూనే ఉన్నారు. అయితే, ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులపై కొంత మేరకైనా స్పందిస్తారని ఆశించినా నిరాశే ఎదురైంది.

సీఎం కేసీఆర్‌ గత నెలలో ప్రధాని మోడీని కలిసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అభ్యర్థించారు. కరీంనగర్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ), హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజెమెంట్‌ (ఐఐఎం), భారతీయ శాస్త్ర విద్యాపరిశోధన మండలి (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌-ఐఐఎస్‌ఇఆర్‌), ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ, జహీరాబాద్‌లోని జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌)కు సాయం, వరంగల్‌ వద్ద కాకతీయ మెగా జౌళి పార్కు అభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు తదితర అంశాలు ప్రస్తావించారు.

ఏదో కొంతైనా సానుకూలంగా ఉంటుందని భావించినప్పటికీ.. బడ్జెట్‌లో వీటి ప్రస్తావనే లేదు. గత ఏడాది అప్పటి మంత్రి కేటీఆర్‌ కేంద్ర జౌళిశాఖ మంత్రిని కలిసి సిరిసిల్లలో మరమగ్గాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికీ కేటాయింపుల్లేవు. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది,. ఇప్పటి వరకు దానిని మంజూరు చేయలేదు. కేంద్ర గనుల శాఖ మెకాన్‌ ద్వారా అధ్యయనం చేస్తున్నామని మూడేళ్లుగా ప్రకటిస్తున్నా అది పూర్తి కాలేదు. ఈ బడ్జెట్ బయ్యారం ఊసే ఎత్తలేకపోవడం గమనార్హం.

ఇటీవల కేంద్రం రాష్ట్రానికి అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)ను మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బీబీ నగర్‌లో ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ క్రమంలో దీనికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులుంటాయని భావించినా ప్రత్యేకంగా నిధులను కేటాయించలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ ప్రాంగణాలకు కేటాయింపులనే బడ్జెట్‌లో ప్రస్తావించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పరిశ్రమల కోసం అమలు చేస్తున్న వడ్డీరాయితీ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించింది. రాయితీ మినహాయింపులు కాకుండా పన్ను మినహాయింపులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినా స్పందించలేదు.

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రం మంజూరు చేసింది. దీనికి ఇప్పటి వరకు నిధులను ఇవ్వలేదు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం పర్యటించి వెళ్లింది. తాజా బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీ గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.8 కోట్లను కేటాయించారు. ఇందులో తెలంగాణకు రూ.4 కోట్లు వస్తాయి. 2018-19లో రెండు రాష్ట్రాలకు రూ.20 కోట్లను కేటాయించిన కేంద్రం అందులో రూ.కోటిని ఏపీలో వెచ్చించింది. తెలంగాణలో ఒక్కరూపాయీ ఖర్చు చేయకపోవడం గమనార్హం.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో ఏపీ సర్కారుతోపాటు విపక్షాలు పెదవి విరిచాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఓట్ల కోసమైనా రాష్ట్రానికి కేంద్రం ఏమైనా ప్రత్యేక కేటాయింపులు ఇస్తారనుకుంటే.. అలాంటదేమీ లేకుండా బడ్జెట్ ముగించేసింది. మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అయినప్పటికీ ఏపీ ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం ఏపీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

అయితే, విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ప్రాజెక్టుల కేటగిరీలో… విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టుల వంటికి మాత్రం కంటితుడుపు కేటాయింపులతో సరిపెట్టింది. విభజన హామీలపై కేంద్రం కనీస దృష్టి సారించకపోవడం శోచనీయం.
విభజన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర గ్రాంట్‌లు, రాయితీల రూపంలో రూ.16,447 కోట్ల మేర రాష్ట్రానికి లబ్ధి చేకూరేదని అంచనా.

హోదాతో సమానమైన ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్రం.. ప్యాకేజీ రూపంలో కూడా ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు దేశీయ ఆర్థిక సంస్థల నుంచి నేరుగా నిధులు సమకూర్చినా, రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన మొత్తంలో కనీసం సగం ఇచ్చినా కొంత వెసులుబాటు లభించి ఉండేది. కానీ కేంద్రం అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లోనూ కేటాయింపులు జరపలేదు.

జాతీయ ప్రాజెక్టు పోలవరానికి కేంద్రమే పూర్తిగా నిధులు కేటాయించాల్సి ఉండగా నాబార్డు ద్వారా వాటిని అందిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే పూర్తయిన పనుల బిల్లులు ఆమోదించకపోవడంతో ఆ నిధులు విడుదల కావడం లేదు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.3500 కోట్ల నిధులనూ కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. తాజా బడ్జెట్‌లో ఈ ప్రస్తావనలేవీ లేకపోవడం గమనార్హం.

సంబంధిత వార్త: కేంద్ర బడ్జెట్ 2019: మధ్య తరగతి, రైతులపై వరాల వర్షం, పార్లమెంటులో పీయూష్ గోయల్ ప్రసంగం

ఇక ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు రూ.62,623 కోట్లతో కేంద్రానికి రాష్ట్రం సమగ్ర ప్రాజెక్టు సమర్పించింది. కానీ, ఇంతవరకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1500 కోట్లు. మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పినా.. ఇంతవరకు అమలు కాలేదు.

అంతేగాక, 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లుగా కాగ్‌ ధ్రువీకరించింది. లోటును పూర్తిగా చెల్లిస్తామన్న హామీని విస్మరించి రూ.3,979.50 కోట్లు మాత్రమే చెల్లిస్తామని కేంద్రం చెప్పింది. మిగతా రూ.12,099.26 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. కేంద్రం పట్టించుకోలేదు.

విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా (వీసీఐసీ) అభివృద్ధి ప్రాజెక్టును జాతీయ పారిశ్రామిక నడవాల అభివృద్ధి, అమలు ట్రస్ట్‌ (ఎన్‌ఐసీడీఐటీ) పరిధిలోకి తీసుకురావాలని, డీఎంఐసీ తరహాలో వీసీఐసీకి కూడా నూరుశాతం నిధుల్ని గ్రాంట్‌ రూపంలో ఎన్‌ఐసీడీఐటీ నుంచి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని 2017 జూన్‌లో కోరింది. ఇంత వరకు స్పందన లేదు.  ఈ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో కేంద్రం రూ.675 కోట్లు మాత్రమే కేటాయించింది. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్న హామీనీ కేంద్రం పట్టించుకోలేదు. చివరి బడ్జెట్‌లో కూడా తమకు అన్యాయమే జరిగిందని తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీలు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

- Advertisement -