ముంబై: సినీనటి సావిత్రి జీవిత గాథను ‘మహానటి’ సినిమాలో చూసి మనమంతా చలించిపోయాం. అలాగే బాలీవుడ్ ‘ట్రాజెడీ క్వీన్’ మీనాకుమారి జీవిత గాథ కూడా కన్నీటి మయమే. ఈ రోజు ఆగస్టు 1 మీనాకుమారి జన్మదినం. మహానటి సావిత్రి జీవితాన్ని తలపించే విధంగానే మీనాకుమారి జీవితం కూడా సాగింది.
1932, ఆగస్టు 1న ముంబైలో జన్మించిన మీనాకుమారి అసలు పేరు మహ్జబీ బానే. మీనాకుమారి తల్లిదండ్రులు కళాకారులు. మీనాకుమారి జన్మించినప్పుడు ఆమె తల్లిదండ్రులు సంతోషపడలేదట! పైగా కొడుకు పుడతాడనుకుంటే కూతురు పుట్టిందని ఆవేదన చెందారట. ఆ నిరాశలో మీనాకుమారి తండ్రి పసిగుడ్డుగా ఉన్నఆమెను ఓ అనాథాశ్రమం వద్ద వదిలేశాడట.
అయితే మీనాకుమారి తల్లి బిడ్డ కోసం ఏడుస్తుండటంతో తిరిగి ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చాడు. మీనాకుమారి నటనను ప్రారంభించాక తన సహజమైన అందంతో, నటనతో ఎందరినో అలరించింది. బాలీవుడ్ నటులు దిలీప్ కుమార్, రాజ్‌కుమార్ తదితరులు మీనాకుమారి వంక అలా చూస్తూ ఉండిపోయేవారట.
మీనాకుమారి తన నట జీవితంలో చాలావరకూ విషాద పాత్రలే వేసింది. దీంతో ఆమెకు ‘ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియా’ అనే పేరు వచ్చింది. చాలామంది నటుల మాదిరిగానే మీనాకుమారి జీవితంలోనూ ఎన్నో కష్టాలు, ఒడిదొడుకులు ఎదురయ్యాయి. వాటికి తట్టుకోలేక ఆమె తాగుడుకు బానిస అయిందంటారు.
ఆ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. చివరికి అనారోగ్యంతోనే ఆమె తనువు చాలించింది. అయితే మీనాకుమారి మరణించి ఏళ్లు గడుస్తున్నా ప్రేక్షకుల మనసులో మాత్రం ఆమె చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె 85వ జన్మదినం సందర్భంగా బుధవారం గూగుల్ మీనాకుమారి చిత్రంతో డూడుల్ కూడా రూపొందించి ప్రదర్శించింది.