ఉద్యోగమూ ఊడిపోయె.. టిక్కెట్టూ రాకపోయె: రాజస్థాన్‌లో ఓ ఎస్పీగారి ఎన్నికల కహానీ!

ips-officer-madangopal-meghwal
- Advertisement -

ips-officer-madangopal-meghwal

జైపూర్: ఆయన ఓ ఎస్పీ. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న ఆ పోలీసు ఉన్నతాధికారికి మదిలో పురుగు తొలిచింది. రాజకీయాల్లో వెళ్లి చక్రం తిప్పాలనిపించింది. వెంటనే చేస్తున్న ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసి.. టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగించారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఖాయమే అనుకున్నారు కూడా. కానీ తీరా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూస్తే.. షాక్‌ కొట్టింది.

పాపం, అందులో ఆయన పేరు లేదు! వెంటనే తేరుకున్న ఆయన కనీసం ఉద్యోగం అయినా నిలబెట్టకునేందుకు ఆఫీసుకు పరుగుపెట్టారు కానీ.. ఫలితం దక్కలేదు. పైఅధికారులు అప్పటికే ఆలస్యమైపోయిందంటూ ఆయనకు మొండి చెయ్యి చూపించారు. దీంతో ‘ఉన్నది కాస్తా పోయిందే’ అనుకుంటూ.. ఆ ఐపీఎస్‌ అధికారి ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు.

రాజకీయ ఆరంగేట్రం కోసం…

ఈ ఎస్పీ గారి ఉదంతం అసెంబ్లీ ఎన్నికలతో వేడెక్కిన రాజస్థాన్‌లోని ఓటర్లకు నవ్వులు పంచుతోంది. సీఐడీ విభాగంలో ఎస్పీగా పని చేసిన ఐపీఎస్‌ అధికారి మదన్‌గోపాల్‌ మేఘ్‌వాల్‌‌కు హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్లాలనిపించింది. బీకానీర్‌లోని ఖజ్‌వాలా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు.

దీనికోసం మదన్‌గోపాల్‌ నవంబరు 15న స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. టిక్కెట్టు కోసం అన్ని ప్రయత్నాలూ చేశారు. ఇక టిక్కెట్టు ఖాయం అనుకుంటున్న తరుణంలో అద‌ృష్టం ముఖం చాటేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థల జాబితాలో మన ఎస్పీగారి పేరే లేదు. దీంతో ఆయన షాక్ తిన్నారు.

టిక్కెట్టు కోసం తాను బంగారంలాంటి ఉద్యోగానికి వీఆర్ఎస్ పెట్టుకున్నాననే విషయం గుర్తొచ్చి తన కార్యాలయానికి పరుగుదీశారు. తన దరఖాస్తును ఆమోదించకండంటూ పైఅధికారులను వేడుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఆయన దరఖాస్తుకు ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేసేశారు. మళ్లీ ఆయన్ని ఉద్యోగంలోకి తీసుకునేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు తేల్చిచెప్పేశారు. రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆయన కోరిక ఇంకా ఐదేళ్ల సర్వీసున్న బంగారం లాంటి ఉద్యోగాన్ని పోగొట్టేసింది. ఇక చేసేదేముంది?

 

- Advertisement -